వన్ సైడ్ లవ్.. పెండ్లి ప్రపోజల్.. ఒప్పుకోలేదని హైదరాబాద్లో డబుల్ మర్డర్..

వన్ సైడ్ లవ్.. పెండ్లి ప్రపోజల్.. ఒప్పుకోలేదని హైదరాబాద్లో డబుల్ మర్డర్..
  • ఇంట్లోకి వచ్చి  కత్తితో యువతి తండ్రిపై దాడి  
  • అడ్డొచ్చిన అమ్మాయి సోదరుడిపైనా అటాక్​ 
  • అక్కడికక్కడే తండ్రి కన్నుమూత
  • చికిత్స పొందుతూ  యువతి తమ్ముడు మృతి

మాదన్నపేట, వెలుగు: ‘నా కూతుర్ని నీకు ఇచ్చి పెండ్లి చేయడం మాకెవరికీ ఇష్టం లేదు.. నా బిడ్డకు కూడా నిన్ను చేసుకోవాలని లేదు.. దయచేసి ఇక నుంచి మా వెంట పడకు.. నా కూతుర్ని వేధించడం బంద్ చెయ్​’ అని అన్న పాపానికి యువతి తండ్రితో పాటు ఆమె తమ్ముడిని కత్తితో పొడిచి చంపేశాడో యువకుడు. హైదరాబాద్​పాతబస్తీలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బాగే జహారాకు చెందిన హజ్మత్​ అలీఖాన్  (54) ఆటో డ్రైవర్..ఇతడికి కొడుకు ఉమర్​అలీఖాన్ (16), ముగ్గురు కూతుళ్లున్నారు. నలుగురూ చదువుకుంటున్నారు. 

వీరి పక్కింట్లో హబీబ్ మహమూద్ (27) కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఇతడు ఎలక్ట్రీషియన్.. అయితే, హజ్మత్​అలీఖాన్​పెద్ద కూతురు ఇంటర్​చదువుతుండగా ఆరు నెలలుగా ఆమెను ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని వెంటపడతున్నాడు. ఆమె చెప్పి చూసినా అతడు మారకపోవడంతో వారం కింద తన తండ్రికి విషయం చెప్పింది. అతడు హబీబ్​ను పిలిచి మందలించాడు. అయితే, హబీబ్​‘నేను నీ కూతురిని ప్రేమిస్తున్నా..పెండ్లి చేసుకుంటే ఆమెనే చేసుకుంటా..నాకు ఇచ్చి పెండ్లి చెయ్​’ అని అడిగాడు. దీనికి హజ్మత్​ తన కూతురు ఇంకా చదువుకుంటోందని, ఇప్పుడే పెండ్లి చేసే ఉద్దేశం లేదని, తన వెంట పడొద్దని ఖరాకండిగా చెప్పాడు. 

దీంతో హబీబ్​హజ్మత్​ కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని అంతమొందించాలని ప్లాన్​వేశాడు. గురువారం రాత్రి కత్తి తీసుకుని సరాసరి హజ్మత్​ఇంటికి వెళ్లాడు. హజ్మత్​కుటుంబసభ్యులతో కలిసి ఉండగా..కత్తి తీసి పొడవడం మొదలుపెట్టాడు. ఇది చూసిన కుటుంబసభ్యులు ‘బచావ్​..బచావ్​..’ అంటూ అరవడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న హజ్మత్​కొడుకు 16 ఏండ్ల ఉమర్​తన తండ్రిని కాపాడేందుకు అడ్డు వెళ్లాడు. దీంతో అతడిని కూడా విచక్షణారహితంగా పొడిచి పారిపోయాడు. తీవ్రంగా రక్తం పోవడంతో హజ్మత్​అక్కడికక్కడే కన్నుమూశాడు. తీవ్ర గాయాలతో ఉన్న ఉమర్​ను ఉస్మానియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 

ఇంట్లో పెద్ద దిక్కయిన తండ్రితో పాటు సోదరుడు కూడా చనిపోవడంతో ముగ్గురు ఆడపిల్లలు, హజ్మత్​భార్య మాత్రమే మిగిలారు. అంతిమయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే, ఏసీపీ వెంకట్​ రెడ్డి, మాదన్నపేట్​సీఐ చంద్రశేఖర్ బందోబస్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్​ చేశామని పోలీసులు ప్రకటించారు. కాగా, ఈ ఘటనలో బాధిత కుటుంబసభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని మలక్​పేట ఎమ్మెల్యే అహ్మద్​ బిన్​అబ్దుల్లా బలాల అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు.  నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చూడాలని కోరారు.