పాత కక్షలు.. ప్రతీకారాలు.. నెలరోజుల్లో 17 మర్డర్స్, 12 హత్యాయత్నాలు

పాత కక్షలు.. ప్రతీకారాలు.. నెలరోజుల్లో 17 మర్డర్స్, 12 హత్యాయత్నాలు
  •  అందరూ చూస్తుండగానే కత్తులతో వీరంగం
  •  కోర్టులు,శిక్షలు అంటే బెదిరేది లేదు
  •  రాష్ట్రంలో కలకలం రేపుతున్న వరుస హత్యలు

‘‘నాగోల్‌‌ పోలీస్‌‌ స్టేషన్‌‌ పరిధిలో సోమవారం జరిగిన ఖమ్మం రౌడీషీటర్‌‌‌‌ నయీమ్‌‌ దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వేటకొడవళ్లు, ఐరన్‌‌ రాడ్లతో వెంటాడి వేటాడి వందల మంది  చూస్తుండగానే అతిదారుణంగా హత్య చేశారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్‌‌ అయిన వీడియో ఫుటేజ్ సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌గా మారింది. సుమారు 12 మంది ప్రత్యర్థులు కత్తులు, రాడ్లతో ఓ రౌడీషీటర్‌‌పై దాడి చేసి హతమార్చిన దృశ్యాలు చూసి పోలీసులు సహా సామాన్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.’’ 

“గత నాలుగు రోజుల క్రితం లాలాగూడలో జరిగిన యువతి హత్య సిటీలో సంచలనంగా మారింది.  వినాయక విగ్రహం వద్ద ఎదురుపడిన యువకులు పాత కక్షలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలతో ఓ యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేసి గొంతుకోసి దారుణంగా హతమార్చారు.’’  

‘‘పోలీసులంటే భయం లేదు. కోర్టులు,శిక్షలు అంటే బెదిరేది లేదు. అందరూ చూస్తుండగానే కత్తులతో వీరంగం సృష్టిస్తున్నారు. నడి రోడ్డుపై దారుణాలకు తెగబడుతున్నారు. సీసీ కెమెరాలకు పోజులు ఇస్తూ మరీ హత్యలు చేస్తున్నారు. ఓ వైపు కిరాయి హంతకులు మరోవైపు పాతకక్షలతో వరుస హత్యలు. ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన హత్యలు తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నాయి. పోలీసులకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి.’’

 

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో, ముఖ్యంగా గ్రేటర్​హైదరాబాద్​లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. రౌడీషీటర్ల మధ్య ఆధిపత్యపోరు, ప్రేమ వ్యవహారాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు.. ఇలా కారణాలు ఏవైనా పట్టపగలే నడిరోడ్లపై హత్యలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. గతంలో హంతకులు తమ ఆనవాళ్లు దొరకకుండా స్కెచ్‌‌వేసేవారు. అంతర్రాష్ట్ర ముఠాలు, సుపారీ కిల్లర్లతో  రెక్కీ వేసి మర్డర్లు చేయించేవారు.

పోలీసులకు ఆధారాలు చిక్కకుండా మాయం చేసేవారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. పోలీసులు, చట్టాలు, శిక్షలు అనే భయం లేకుండా పట్టపగలే దారుణాలుకు పాల్పడుతున్నారు. హత్యలు చేసి జైలుకెళ్లడం, జైలు నుంచి  విడుదల అయ్యాక ఎదుటివారిలో భయాందోళనలు సృష్టిస్తున్నారు. ఇలా నెల రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 17 హత్యలు..12 హత్యాయత్నాలు పోలీసులకు సవాల్‌‌గా మారాయి. 

‘‘నిజామాబాద్‌‌లో గురువారం చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జగిత్యాలకు చెందిన యూట్యూబర్‌‌ వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త చిత్తరి హరిబాబుపై వైష్ణవి సోదరుడు సంతోష్‌‌ కత్తితో దాడి చేసి అతి కిరాతకంగా హతమార్చాడు. హత్య కారణాలు సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు. పోలీసులకు లొంగిపోతున్నానని.. తనకు అందరూ సహరించాలని కోరాడు. సినిమా తరహాలో చేతిలో కత్తి పట్టుకుని సీసీటీవీ కెమెరాలకు చిక్కాడు.’’