పెరిగిన గ్యాస్ కష్టాలతో బయట తినటమే కాస్ట్లీగా మారిందంటే దానిని ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకోవటం మరింత ఖరీదుగా మారిపోనుంది. అవునండీ మీరు విన్నది నిజమే.. ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే వారికి త్వరలోనే జేబులు గుల్ల కానున్నాయి. దేశంలో పెట్రోల్ ధరలను పెంచేయటంతో ఆ ప్రభావం జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై తీవ్రంగా పడనుందని ఎలారా క్యాపిటల్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో కస్టమర్లు ఆర్డర్ చేసే ఆహార పదార్థాల ధరలు మరింత ఖరీదు కానున్నట్లు రిపోర్ట్ స్పష్టం చేస్తోంది.
ఇటీవల లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై దాదాపు 4 రూపాయల వరకు పెరగడంతో ఇంధన ఖర్చులు 4 శాతం మేర భారమయ్యాయి. ఈ ఇంధన ధరల పెంపు వల్ల ఫుడ్ డెలివరీ కంపెనీలకు ప్రతి ఆర్డర్‌పై సుమారు రూ. 0.44 అదనపు భారం పడుతుందని అంచనా. క్విక్ కామర్స్ ఆర్డర్లకు సగటున రూ.35-50, ఫుడ్ డెలివరీకి రూ.55-60 వరకు డెలివరీ ఖర్చు అవుతోందట. మొత్తంగా చూస్తే జొమాటోకు రూ.45, స్విగ్గీకి రూ.55 సగటు డెలివరీ ఖర్చు అవుతుండగా.. ఇందులో ఇంధనం కోసమే 20 శాతం అంటే సుమారు రూ.10 ఖర్చవుతోందని తేలింది.
మరోవైపు పెరుగుతున్న పెట్రోల్ ధరలపై డెలివరీ బాయ్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చే కమిషన్లు పెంచకపోతే బతికేది ఎలా అని యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి. బైకులు, స్కూటర్లపైనే ప్రతిరోజూ ఆధారపడి జీవిస్తున్న దాదాపు కోటి 20 లక్షల మంది గిగ్ వర్కర్ల రోజువారీ ఆదాయంపై ఈ ధరల పెరుగుదల దెబ్బ తీసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ ఖర్చులు, బండి మెయింటెనెన్స్ ఖర్చులకు తగినట్లుగా కంపెనీలు తమకు ఇచ్చే డబ్బులు పెంచకపోతే.. ఈ రంగాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాల్సి వస్తుందని గిగ్ వర్కర్లు హెచ్చరిస్తున్నారు.
డెలివరీ భాగస్వాముల నుంచి వస్తున్న ఒత్తిడి, ఇంధన ధరల భారంతో కంపెనీలు తమ లాభాలను కాపాడుకోవడానికి ఈ అదనపు ఖర్చులను కస్టమర్లపైనే నెట్టేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీ కంపెనీల ఆదాయాలపై పెద్దగా ప్రభావం పడకపోయినప్పటికీ.. డెలివరీ ఛార్జీలను, ప్లాట్‌ఫారమ్ ఫీజులను పెంచడం ద్వారా మరి కొద్ది రోజుల్లో కంపెనీలు ఈ నష్టాన్ని పూడ్చుకోనున్నాయి. ఫలితంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్రియులకు మున్ముందు అదనపు బాదుడు తప్పేలా లేదు.
