ఊళ్లలో మిషన్ ​భగీరథ కనెక్షన్ల లెక్క.. 32% ఇండ్లకే నల్లాలు

ఊళ్లలో మిషన్ ​భగీరథ కనెక్షన్ల లెక్క.. 32% ఇండ్లకే నల్లాలు
  • టీఆర్​ఎస్​ ఎంపీ ప్రశ్నకు లెక్కలిచ్చిన కేంద్రం
  • నాలుగు జిల్లాల్లో 5% దాటని కనెక్షన్లు
  • మరో 4 జిల్లాల్లోనే 50% మించి కనెక్షన్లు
  • మిషన్​ భగీరథ పూర్తయిందని రాష్ట్ర సర్కార్​ ప్రచారం

హైదరాబాద్, వెలుగు:

రాష్ట్రవ్యాప్తంగా ఊళ్లలో 32 శాతం ఇండ్లకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల పార్లమెంట్​ సమావేశాల్లో టీఆర్​ఎస్​ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వకంగా ఈ వివరాలు వెల్లడించింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన చూస్తే  నిజామాబాద్, నిర్మల్, ఆసిఫా బాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో  5శాతం కూడా నల్లా కనెక్షన్లు లేవని తేలింది.  మల్కాజ్ గిరి, యాదాద్రి భువనగిరి,  రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి  జిల్లాల్లో మాత్రమే 50శాతం పైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయని వెల్లడైంది. అయితే ఇంటింటికీ మంచినీరు అందించే మిషన్​ భగీరథ పథకం పనులు 90శాతం పూర్తయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకంలో భాగంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్​ పనులు 100శాతం పూర్తి చేసినట్లు అధికారులు చెబుతుండటం ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

మన్నె ప్రశ్నకు కటారియా సమాధానం

దేశవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ (ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చే కేంద్ర పథకం) అమలుపై పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో మహబూబ్ నగర్ టీఆర్​ఎస్​ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ స్కీంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని ఇండ్లకు మంచి నీరు అందుతుందో  తెలపాలని కోరారు.  జిల్లాలవారీగా పథకం అమలుకు సంబంధించి జాబితాను ఇవ్వాలన్నారు. ఇందుకుగానూ కేంద్ర జల్ శక్తి సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఊళ్లలో కేవలం 32 శాతం ఇండ్లకే పైపుల ద్వారా నల్లా నీళ్లు అందుతున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాల వారీగా నల్లా కనెక్షన్లపై సమగ్ర నివేదికను ఇచ్చారు. మిషన్​ భగీరథలో భాగంగా రాష్ట్రంలో 100 శాతం నల్లా కనెక్షన్లు పూర్తయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా.. కేంద్రం మాత్రం ఊళ్లలో 32 శాతమే నల్లా కనెక్షన్లు ఉన్నాయని చెప్పడం మిషన్​ భగీరథ తీరుపై ప్రశ్నలకు తావిస్తోంది. ఇటీవల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి సైతం రాష్ట్రంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆయన బాహాటంగానే విమర్శించారు. మరికొందరు ఎమ్మెల్యేలు తమ సొంతూళ్లకే భగీరథ నీళ్లు రావడం లేదన్నారు.

ప్రజలకు ఒక మాట.. కేంద్రానికి మరో మాట

మిషన్ భగీరథ పై రాష్ట్ర ప్రభుత్వం.. ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేలా నల్లా కనెక్షన్లు ఇచ్చామని చెబుతోంది. కేంద్రానికి మాత్రం పొంతన లేని లెక్కలు సమర్పించింది.  జల్ జీవన్ మిషన్(జేజేఎం)పై నవంబర్ 11న హైదరాబాద్ లో దక్షిణాదిలోని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా నల్లా కనెక్షన్ల లిస్టును కేంద్రానికి అందించింది. 32 శాతం(ఓవరాల్ గా) మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఉందని లిస్టులో పేర్కొంది. అంతకుముందు ఆగస్టులో ఢిల్లీలో జరిగిన జల్ జీవన్ మిషన్ సమావేశంలోనూ రాష్ట్ర సర్కార్ ఇవే లెక్కల్ని కేంద్రానికి చెప్పింది.

ఇంటింటికి నిధులు కాదు

భగీరథ పనుల ఖర్చులో సగం కేంద్రం భరించాలంటూ రాష్ట్ర  ప్రభుత్వ పెద్దలు, ప్రజా ప్రతినిధులు చేస్తున్న డిమాండ్లపై గతంలోనే కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. హర్ ఘర్ జల్ పథకం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులు కేవలం ఇంటింటికి నిధులు అనుకుంటున్నారని జల్ జీవన్ మిషన్ సమావేశంలో కేంద్ర మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు.  హర్​ ఘర్​ జల్​ పథకంలో భాగంగా ఇంటింటికి నీరందించడంతో పాటు, నీటి నిల్వ చర్యలు, భూగర్భ జలాల పరిరక్షణతో పాటూ మరిన్ని అంశాలు కలిసి ఉన్నాయన్నారు. కానీ, తెలంగాణ సర్కార్ మాత్రం ఇవేవీ చేయకుండా కేవలం పైపులు వేసి, ప్రాజెక్ట్ అంచనాలో 50 శాతం నిధులు ఇవ్వాలనడం సరికాదని చెప్పారు. మిషన్ భగీరథ అనేది ఇంటింటికి తాగునీరు మాత్రమే అందించనుందని, హర్ ఘర్ జల్ లోని మిగిలిన లక్ష్యాలను చేపట్టినప్పుడే నిధులు ఇస్తామని తేల్చిచెప్పారు.

జల్ జీవన్ మిషన్ కు,  భగీరథ మధ్య సంబంధం

దేశంలోని 14.6  కోట్ల ఇండ్లకు 2024 వరకు సురక్షిత మంచినీరు అందించాలన్నది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘జల్ జీవన్ మిషన్’ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఇంటింటికి నల్లా నీరు అందించేందుకు నిధుల్ని సమకూర్చుతుంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ సైతం ఇలాంటి పథకమే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని ఇండ్లకు పైప్ లైన్లు వేసి, రక్షిత మంచినీరు అందించనున్నారు. ఇందులో భాగంగా హడావుడిగా రోడ్లు తవ్వి పైప్ లైన్లు వేశారని, కొన్ని జిల్లాల్లో నల్ల కనెక్షన్లు ఉన్నా కొత్త టెక్నాలజీ పేరుతో  మళ్లీ కొత్త కనెక్షన్లు వేసినట్లు విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఊళ్లలో 32 శాతం మాత్రమే నల్ల కనెక్షన్లు ఇచ్చామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. ఇలా 32 శాతం మాత్రమే నల్లా కనెక్షన్లు ఉంటే, ఇంటింటికి రక్షిత మంచినీరు అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటోంది.

పల్లెల్లో మిషన్ భగీరథ లెక్కలు

మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెండు విధాలుగా భావిస్తోంది. ఒకటి పట్టణాల్లో ఇంటింటికి మంచినీరు, రెండోది గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి మంచినీరు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65 లక్షల 29 వేల 770 ఇండ్లకు మంచినీరును అందించే పథకం మిషన్ భగీరథ. అయితే, ఇందులో 52 లక్షల 47 వేల 225  ఇండ్లు గ్రామీణ ప్రాంతాల్లో, 12 లక్షల  82 వేల 545 ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.  గ్రామీణ ప్రాంత్రాల్లో ఇప్పటి వరకు 18 లక్షల 81 వేల 789 ఇండ్లకు, అంటే దాదాపు 32 శాతం మాత్రమే పనులు పూర్తి చేయగలిగారు. నల్లా కనెక్షన్లు కలిగిన జిల్లాల్లో మల్కాజ్ గిరి 67.74 శాతంతో మొదటి వరుసలో ఉంటే, నిజామాబాద్ జిల్లా 2.27 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

డేటా అప్​డేట్ ​కాలేదంటున్న ఆఫీసర్స్​

రాష్ట్ర ప్రభుత్వ తాజా డేటాను అప్ డేట్ చేయకపోవడం వల్లే కేంద్ర, రాష్ట్ర లెక్కల్లో తేడాలు వచ్చాయని మిషన్ భగీరథ కీలక అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో నల్లా కనెక్షన్​ లేని ఇల్లంటూ లేదని అన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చినా, కొన్ని ప్రాంతాల్లో ట్యాంక్ ల పని పూర్తికాకపోవడం వల్ల నీరు అందించలేకపోతున్నామని తెలిపారు. మరికొన్ని తండాలు, గ్రామీణ ప్రాంతాల్లో  పనులు పెండింగ్​లో ఉన్నాయని చెప్పారు. అయితే, నవంబర్ 11 న జరిగిన జల్​ జీవన్​ మిషన్​ సమావేశంలో అధికారులు ఇచ్చిన నివేదికలకు, ఇప్పటికీ కేవలం 40 రోజులు పూర్తయింది. మరి ఈ కొంత సమయంలో ఏ విధంగా 65 శాతానికి పైగా పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిందో అర్థం కాని ప్రశ్న.

కేంద్ర నివేదికల ప్రకారం..

5 శాతం లోపు నల్లా కనెక్షన్లు ఉన్న జిల్లాలు

నిజామాబాద్ (2.27),

నిర్మల్ (3.06), కొమురం భీం

ఆసిఫా బాద్ (3.8), ఆదిలాబాద్ (4.04)

10 నుంచి 40 శాతం మధ్య నల్లా కనెక్షన్లు ఉన్న జిల్లాలు

జోగులాంబ గద్వాల్(11.74), మంచిర్యాల(12.21), కామారెడ్డి(14.3), నాగర్ కర్నూల్(20.92), వరంగల్ అర్బన్(22.67), భద్రాద్రి కొత్తగూడెం(25.03), వనపర్తి(29.27), మహబూబ్ నగర్(29.36), సూర్యపేట (30.49), వికారాబాద్ (31.49), వరంగల్ (33.62), సంగారెడ్డి (36.07), జయశంకర్ భూపాలపల్లి (37.44)

40 నుంచి 50 శాతం నల్లా కనెక్షన్లు ఉన్న జిల్లాలు

రంగారెడ్డి(49.94), మెదక్(49.91), జనగాం(48.75), సిద్ధిపేట(47.75), కరీంనగర్(45.86), ఖమ్మం(44.22), నల్లగొండ(44.19), జగిత్యాల(42.32)

50 నుంచి 70 శాతం మధ్య నల్లా కనెక్షన్లు ఉన్న జిల్లాలు

మల్కాజ్ గిరి(67.74), యాదాద్రి భువనగిరి(64.02), రాజన్న సిరిసిల్ల (55.55), పెద్దపల్లి (50.66)

Only 32 per cent of households across the state have Nalla connections, the central government said