HCAకే షాకిచ్చిన ముఠా: PMO, గవర్నర్ ఆఫీస్ పేర్లతో ఐపీఎల్ టికెట్ల దందా

HCAకే షాకిచ్చిన ముఠా:  PMO, గవర్నర్ ఆఫీస్ పేర్లతో ఐపీఎల్ టికెట్ల దందా

హైదరాబాద్‌లో ఐపీఎల్ టికెట్ల దందా గుట్టురట్టయింది. బడా అధికారుల పేర్లతో హెచ్‌సీఏను (HCA) బురిడీ కొట్టించాలని చూసిన ఓ ముఠా ఎట్టకేలకు పోలీసుల చిక్కింది. మల్కాజ్‌గిరి ఎస్ఓటి (SOT), స్పెషల్ బ్రాంచ్ ,హెచ్‌సీఏ కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ నకిలీ రాయుళ్లు అడ్డంగా దొరికారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... నగరంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం కొందరు కేటుగాళ్లు పక్కా స్కెచ్ వేశారు. ఏకంగా PMO (ప్రధాని కార్యాలయం), గవర్నర్ ఆఫీస్, హైకోర్టు జడ్జిల పేర్లను వాడుకుంటూ టికెట్ల కోసం హెచ్‌సీఏ సెక్రటరీ మన్నె జీవన్ రెడ్డికి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA), ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) పేర్లతో నకిలీ లెటర్ హెడ్‌లను సృష్టించి అధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు.

అయితే ఈ కాల్స్‌పై అనుమానం వచ్చిన హెచ్‌సీఏ సెక్రటరీ జీవన్ రెడ్డి, వెంటనే మల్కాజ్‌గిరి సీపీ సుమతికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఎస్.ఓ.టి పోలీసులు.. హెచ్‌సీఏ సాయంతో నిందితులకు చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్ వేశారు. టికెట్లను ఎరగా వేసి, బ్లాక్‌లో విక్రయిస్తుండగా నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ప్రస్తుతం ఈ ముఠాలోని ప్రధాన నిందితుడు అశోక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన సభ్యుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.