
- మంచిర్యాల రైల్వే పోలీస్ స్టేషన్ పరిస్థితి
- 29 రైల్వే స్టేషన్లు..230 కి.మీ. మార్గం
శనివారం మబ్బుల్నే సికింద్రాబాద్ నుంచి నాగ్ పూర్ పోతున్న నాగ్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు మందమర్రి రవీంద్రఖని (రామకృష్ణా పూర్) దగ్గరకు వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు రైలు ఆపి ఇద్దరు మహిళలను బెదిరించి ఆరు తులాల బంగారు నగలు గుంజుకుని పరారయ్యారు.
ఏప్రిల్ 24 న పొద్దున కుమరంభీం జిల్లా సిర్పూర్ (టి) మండలం మాకోడి దగ్గర రక్షావల్ ఎక్స్ ప్రెస్ రైల్లో మహిళ నుంచి రూ.4.50 లక్షల విలువైన బంగారు నగలు, క్యాష్ దోచుకున్నారు.
మంచిర్యాల జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదాపు అన్ని రైల్వే స్టేషన్ల నుంచి రేషన్ బియ్యం రోజూ మహారాష్ట్రకు అక్రమంగా తరలిపోతున్నది. గంజాయి, కలప, మద్యం అక్రమంగా తరలిస్తున్నారు . రైల్వే స్టేషన్లలో జేబు దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఈ స్టేషన్ పరిధిలోని 230 కిలోమీటర్ల రైలు మార్గం వెంట రోజూ జరుగుతున్న నేరాలెన్నో …
మంచిర్యాలలోని జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్ర సరిహద్దులోని కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, వరంగల్ అర్బన్ జిల్లాలోని 29 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 230కిలోమీటర్ల రైలు మార్గం ఈ స్టేషన్ కిందకు వస్తుంది. చెన్నై– న్యూఢిల్లీ, విజయవాడ – న్యూడిల్లీ బ్రాడ్ గేజ్ లైను కావడంతో ఈ స్టేషన్ పరిధిలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏటా వందల కేసులు నమోదవుతున్నా కొలిక్కి వస్తున్నవి కొన్నే. కేసులకు తగ్గట్టుగా ఇక్కడ సిబ్బంది లేరు. దీంతో ఎక్కడైనా నేరాలు జరిగితే పోలీసులు అక్కడకు చేరుకోలేక పోతున్నారు.అక్రమ రవాణాను అరికట్టడంలో కూడా సిబ్బంది కొరత అడ్డంకిగా మారుతోంది. రైళ్లల్లో జరుగుతున్నచోరీలు, బియ్యం రవాణా లాంటి నేరాల్లో మహిళలు పాల్గొంటున్నారు. కానీ ఈ స్టేషన్ లో ఒక్క లేడీ కానిస్టేబుల్ కూడా లేరు.
సిబ్బంది 25 మందే
మంచిర్యాల ప్రభుత్వ జీఆర్పీ పోలీస్‌స్టేషన్ పరిధిలో 29 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ పరిధిలో రామగుండం(పెద్దపల్లి), బెల్లం పల్లి(మంచిర్యాల), కాగజ్ నగర్(కుమురంభీం)లో ఔట్ పోస్టులున్నాయి. ఇది చాలా రద్దీ ఉండే రూటు. లా అండ్ ఆర్డర్ , నేరాల నియంత్రణ సవాలుగా ఉంటుంది. అయినా ఈ స్టేషన్ చాలాకాలంగా అరకొర సిబ్బందితో నడుస్తోంది .2017లో ఈ స్టేషన్ లో 300 పైగా కేసులు నమోదయ్యాయి. సుమారు 25 మంది అధికారులు, సిబ్బంది విధులు నిర్వహి స్తున్నారు.
మంచిర్యాల స్టేషన్లోఎస్సైగా పనిచేసిన జితేందర్‌రెడ్డి 2017 ఫిబ్రవరిలో బదిలీ కాగా, బెల్లంపల్లి ఔట్ పోస్ట్‌లో ఎస్సైగా పనిచేసిన బన్సిలాల్ ప్రమోషన్ పై వెళ్లారు. అప్పటి నుంచి రెండు స్టేషన్లలో ఇన్ ఛార్జీలే ఉన్నారు. చోరీలు,స్మగ్లింగ్ ను అడ్డుకోవాల్సిన పోలీసులకు ఆత్మహత్య చేసుకున్న, ప్రమాదాల్లో చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పటంలోనే సమయం గడిచిపోతోంది. మంచిర్యాలలో సీఐ స్థా యి అధికారిని నియమించాలని, నాలుగు స్టేషన్లకు నలుగురు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలు, పది మంది హెడ్ కానిస్టేబుల్స్, 40 మంది కానిస్టేబుల్స్, పదిమంది మహిళా కానిస్టేబుల్స్ ఉండాలని పోలీసులు అంటు న్నారు. సిబ్బందిని పెంచాలని చాలాసార్లు ప్రతిపాదనలు పంపినట్టు చెప్తున్నారు.