
భారత్, పాకిస్తాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతల ఎఫెక్ట్ ఆపరేషన్ కగార్ పై పడింది.. తెలంగాణ సరిహద్దుల్లోని CRPF బలగాలను రప్పించాలని నిర్ణయించింది కేంద్రం. శనివారం ( మే 10 ) CRPF కోబ్రా జవాన్లను తమ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. పామూరు, ఆలూబాక, పెద్దగుట్ట పరిసరాల్లో మోహరించిన బలగాలకు రిలీవ్ చేయాలని నిర్ణయించింది. ఇండియా పాకిస్తాన్ వార్ నేపద్యంలో కర్రేగుట్టల నుండి సుమారు 9వేల మందికి పైగా బలగాలను వెనక్కి రప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఆదివారం ( మే 11 ) ఉదయంలోగా బలగాలు ఇండో - పాక్ బార్డర్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్ వైపు CRPF 217, 81, 86 బెటాలియన్లు, DRG, STF, బస్తర్ ఫైటర్స్ ఆధ్వర్యంలో యదావిధిగా కొనసాగనుంది.ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేసి, మావోయిస్టులతో చర్చలు జరపాలని ఆదివాసీ, గిరిజన, ప్రజాసంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.
అటవీ ప్రాంతాల్లో గల ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను మొదలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్రెగుట్టల్లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని, కేంద్ర బలగాలను వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు. చర్చలకు సిద్ధమేనని మావోయిస్ట్ పార్టీ సైతం ప్రకటించిందని, ప్రభుత్వం ముందుకు వచ్చి చర్చలు జరిపి ఆదివాసుల హక్కుల కాపాడాలన్నారు.