‘ఆపరేషన్‌‌ యాత్రి సురక్ష’తో హైటెక్‌‌ నిఘా..సికింద్రాబాద్‌‌ రైల్వే డివిజన్‌‌లో 500 సీసీటీవీలు

‘ఆపరేషన్‌‌ యాత్రి సురక్ష’తో హైటెక్‌‌ నిఘా..సికింద్రాబాద్‌‌ రైల్వే డివిజన్‌‌లో 500 సీసీటీవీలు

పద్మారావునగర్‌‌, వెలుగు: సికింద్రాబాద్‌‌ డివిజన్‌‌ పరిధిలో ప్రయాణికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు రైల్వే రక్షణ దళం(ఆర్‌‌పీఎఫ్‌‌) ‘ఆపరేషన్‌‌ యాత్రి సురక్ష’ పేరుతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. డివిజన్‌‌ వ్యాప్తంగా నిరంతర నిఘా కోసం 500 సీసీటీవీ కెమెరాలు, 100 సోలార్‌‌ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు సిబ్బందికి 15 బాడీ వోర్న్‌‌ కెమెరాలను అందజేసింది. భూమిపై, ఆకాశంలో ఒకేసారి నిఘా నిర్వహించేందుకు డ్రోన్లను వినియోగిస్తుండగా, స్టేషన్లలో వేగంగా స్పందించేందుకు సెగ్వే వాహనాలను ఉపయోగిస్తున్నారు.

రాత్రివేళ నడిచే 20 కీలక రైళ్లలో ప్రత్యేక రక్షణ దళాన్ని మోహరించగా, 16 అత్యంత సున్నిత ప్రాంతాల్లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ చర్యల ఫలితంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో వివిధ నేరాలకు పాల్పడుతున్న 78 మంది నేరస్తులను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే రైల్వే నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రవేశించిన 3 వేల మందిని అడ్డుకున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు రైలు ప్రయాణంలో అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే రైల్వే హెల్ప్‌‌లైన్‌‌ 139కు సమాచారం అందించాలని సికింద్రాబాద్‌‌ డివిజన్‌‌ సీనియర్‌‌ డీఎస్‌‌సీ ఆలకుంట నవీన్‌‌కుమార్‌‌ సూచించారు.