- 1937 నాటి తీర్మానం వెనుక ముస్లిం లీగ్ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపణ
న్యూఢిల్లీ: ‘వందేమాతరం’ గీతాన్ని పూర్తిగా పాడటాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫైర్అయ్యారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ నిర్ణయం భవిష్యత్తులో రాజకీయ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని అన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ‘వందేమాతరం’లోని రెండు చరణాలను మాత్రమే పాడాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ చెబుతోంది. దీనిపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన రాజ్‌నాథ్ సింగ్.. జాతీయ గీతాన్ని గౌరవించేందుకు నిరాకరించడం సరికాదన్నారు.
‘‘వందేమాతరాన్ని పూర్తిగా వ్యతిరేకించడం దురదృష్టకరం. ఇది రాజ్యాంగపరంగా చాలా తీవ్రమైన విషయం’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రస్తావిస్తున్న 1937 నాటి తీర్మానం ముస్లిం లీగ్ ఒత్తిళ్లకు తలొగ్గి తీసుకున్నదేనని కేంద్ర మంత్రి ఆరోపించారు. తీవ్రవాద శక్తులతో రాజీ పడటం దేశానికి ఎప్పుడూ నష్టమేనని అన్నారు. చట్టాలను, రాజ్యాంగ విలువలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు. దేశభక్తిపై అనవసరమైన వివాదాలు రాకుండా జాతీయ గీతాలకు గౌరవం ఇవ్వాలని సూచించారు.
పార్లమెంటు చట్టాన్ని సోనియా గాంధీ చెత్తబుట్టలో వేయగలరా?: స్మృతి ఇరానీ
‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్ వైఖరిపై బీజేపీ నేత స్మృతి ఇరానీ మండిపడ్డారు. ‘జన గణ మన’తో సమాన గౌరవం ఇవ్వాల్సిన వందేమాతరాన్ని కాంగ్రెస్ పరిమితం చేయడమేంటని ప్రశ్నించారు. పార్లమెంటు చట్టం చేసిన తర్వాత దాన్ని పట్టించుకోకుండా ఉండే హక్కు సోనియా గాంధీకి ఉందా అని నిలదీశారు. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరానీ మాట్లాడుతూ ‘‘పార్లమెంటు ఒక అంశంపై చట్టం చేసిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే ప్రత్యేక హక్కు సోనియా గాంధీకి ఉందా?’’ అని ప్రశ్నించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయంలో వందేమాతరం వినిపిస్తున్న సమయంలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేతో మాట్లాడిన తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో వందేమాతరం తొలి రెండు చరణాలకే పరిమితం చేస్తామని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ‘‘వందేమాతరంలో భారతమాతతో పాటు దుర్గాదేవి, లక్ష్మీదేవి ప్రస్తావనలు ఉన్నాయి. వాటిపై కాంగ్రెస్‌కు అభ్యంతరమా?’’ అని ప్రశ్నించారు. ఇటీవల కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు కాంగ్రెస్ భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
