V6 News

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌ను తొలగించాలి.. రాజ్యసభలో ప్రతిపక్షాల కొత్త నోటీసు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌ను తొలగించాలి.. రాజ్యసభలో ప్రతిపక్షాల కొత్త నోటీసు

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌‌ను తొలగించాలని కోరుతూ రాజ్యసభలో ప్రతిపక్షాలు కొత్త నోటీసు సమర్పించాయి. శుక్రవారం 11 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 73 మంది ఎంపీల సంతకాలతో కూడిన నోటీసును రాజ్యసభ సెక్రటరీ జనరల్  పీసీ మోదీకి అందజేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 (5) తో పాటు ఆర్టికల్ 124(4), ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) చట్టం-2023లోని సెక్షన్ 11(2), న్యాయమూర్తుల (విచారణ) చట్టం-1968ల కింద దుష్ప్రవర్తన కారణంగా జ్ఞానేశ్ కుమార్‌‌ను తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి ఉద్దేశించిన లేఖను రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు.

“ప్రధాన ఎన్నికల కమిషనర్‌‌పై ఇప్పుడు తొమ్మిది నిర్దిష్ట ఆరోపణలు ఉన్నాయి. అవి చాలా వివరంగా నమోదయ్యాయి. వాటిని ఏ విధంగానూ ఖండించడం లేదా కప్పిపుచ్చడం సాధ్యం కాదు. ఆయన ఆ పదవిలో కొనసాగడం రాజ్యాంగంపై దాడి చేయడమే. ప్రధానమంత్రి, హోం మంత్రి చెప్పినట్లు చేయడానికి ఆ వ్యక్తి ఇంకా పదవిలో కొనసాగడం పూర్తిగా అవమానకరం” అని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. ‘‘మేము ఈరోజు మధ్యాహ్నం 73 సంతకాలతో నోటీసును సమర్పించాము.

ఈసారి సీఈసీని తొలగించడానికి నిర్దిష్ట సంఘటనలను మేము పేర్కొన్నాము’’ అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. జ్ఞానేశ్ కుమార్‌‌పై అభిశంసన నోటీసులను పార్లమెంటు తిరస్కరించిన తరువాత ప్రతిపక్ష పార్టీలు ఈ చర్యను విమర్శించాయి. టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయెన్  మాట్లాడుతూ ఇది  పార్లమెంటును అపహాస్యం చేయడమేనని విమర్శించారు.