V6 News

మహిళల హక్కులకు ప్రతిపక్షాలు వ్యతిరేకం.. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫైర్

మహిళల హక్కులకు ప్రతిపక్షాలు వ్యతిరేకం.. లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ఫైర్
  • అధికారంలో ఉన్నప్పుడూ చేయలేదు.. ప్రతిపక్షంలో కూర్చున్నా కాంగ్రెస్ తీరు మారలేదని విమర్శ
  • ‘ఒక వ్యక్తి - ఒక ఓటు - ఒకే విలువ’ కోసం ఉద్దేశించిందే డీలిమిటేషన్
  • ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో జనాభా 40 లక్షలు దాటింది 
  • ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపునూ అబద్ధపు ప్రచారంతో అడ్డుకుంటున్నాయని వెల్లడి

న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల కోసం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లును అడ్డుకోవడమంటే మహిళలను వారి హక్కులు పొందకుండా అడ్డుకోవడమేనని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పేర్కొన్నారు. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు బిల్లును వ్యతిరేకించడమంటే ఎస్సీ, ఎస్టీ సీట్ల పెంపునకు మోకాలడ్డడమేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం లోక్ సభలో జరిగిన చర్చలో అమిత్​ షా మాట్లాడారు.

మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులను కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై జరిగిన చర్చలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళల రిజర్వేషన్లకు సంబంధించి తామంతా పూర్తిస్థాయిలో మద్దతిస్తామంటూ సభలోని సభ్యులు అందరూ సమ్మతి తెలియజేస్తున్నారని అన్నారు.

అయితే, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాత్రమే ఈ బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని షా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా నియోజకవర్గాల పునర్విభజన చేయలేదని, సామాన్య పౌరుడికి తగిన ప్రాతినిధ్యం దొరకనివ్వలేదని ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కూడా ఆ పార్టీ వైఖరిలో మార్పులేదని మండిపడ్డారు. 

‘ఒక వ్యక్తి– ఒక ఓటు– ఒకే విలువ’ కోసం ఉద్దేశించిందే డీలిమిటేషన్ అని అన్నారు. ప్రస్తుతం ఒక నియోజకవర్గంలో 40 లక్షల జనాభా ఉంటే, మరో నియోజకవర్గంలో కేవలం 6 లక్షల మంది మాత్రమే ఉన్నారని గుర్తుచేశారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల ఓటు విలువ వేర్వేరని అన్నారు.

రాజ్యాంగ ప్రకారమే డీలిమిటేషన్..
రాజ్యాంగం ప్రకారం నిర్ణీత కాలవ్యవధిలో పెరిగిన జనాభాకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని అమిత్​ షా చెప్పారు. పునర్విభజన ప్రతిపాదన వెనుక ప్రభుత్వానికి రహస్య ఎజెండా ఉందనే తప్పుడు ఆరోపణలతో బిల్లులను వ్యతిరేకించ వద్దని ప్రతిపక్షాల ఎంపీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. 

పునర్విభజన ప్రక్రియను ఇప్పుడు ప్రారంభించడానికి గల కారణాలపై సభలో చాలామంది సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారని షా అన్నారు. అయితే, ఇప్పుడు ఈ ప్రక్రియ చేపడితేనే ‘నారీ శక్తి వందన్ అధినియం’ ప్రకారం 2026 తర్వాతి జనగణన, ఆ తర్వాత చేపట్టే పునర్విభజనలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం వీలవుతుందని వివరించారు. 

మళ్లీ ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని, 1971లో ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎంపీల సీట్ల సంఖ్యను స్తంభింపజేసిందని, ఆ పరిమితిని ఎత్తివేస్తే తప్ప ‘నారీ శక్తి వందన్ అధినియం’ అమలు చేయడం సాధ్యంకాదని అన్నారు. అందుకే కేంద్రం ప్రస్తుతం ఈ బిల్లును తీసుకువచ్చిందని అమిత్​ షా సభలో వివరణ ఇచ్చారు.

కుల గణనపై ఆరోపణలకు జవాబు..
జనగణనలో కుల గణనను ఆలస్యం చేయడానికే మహిళా రిజర్వేషన్ల బిల్లు తెచ్చారన్న వాదనను కూడా అమిత్ షా తోసిపుచ్చారు. ‘2025లో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జనగణనతో పాటు కుల గణనను కూడా నిర్వహించాలని నిర్ణయించాం. ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది’ అని చెప్పారు. 

ప్రతిపక్ష పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తే, రాష్ట్రాలవారీగా లోక్‌‌‌‌సభ సీట్లను 50 శాతం పెంచే అంశాన్ని ప్రస్తావిస్తూ అధికారిక సవరణను తీసుకువస్తానని హోంమంత్రి హామీ ఇచ్చారు. ‘ప్రతిపక్షాలు అనుకూలంగా ఓటు వేయకపోతే మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోతుంది. కానీ దేశంలోని మహిళలు ఎవరు అడ్డంకిగా ఉన్నారో గమనిస్తున్నారు’ అని ఆయన హెచ్చరించారు.

కాంగ్రెస్​కు తగిన శాస్తి తప్పదు
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అడ్డుకోవడం అత్యంత నీచమైన చర్య. మహిళా శక్తికి దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కును కాలరాయడమే కాకుండా, బిల్లు ఓటమిపై వేడుకలు చేసుకోవడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. ప్రతిపక్షాల తీరు మహిళల ప్రయోజనాలకే కాదు. దేశ హితానికి కూడా వ్యతిరేకం. మహిళా శక్తికి చేసిన ఈ అవమానానికి ప్రతిపక్షాలు రాబోయే 2029 లోక్‌‌‌‌సభ ఎన్నికలతో పాటు ప్రతి ఎన్నికలోనూ మహిళల ఆగ్రహాన్ని, తీవ్రమైన పరాభవాన్ని చవిచూడక తప్పదు. 

అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

‘ఉత్తర-దక్షిణ’ వివాదం వద్దు..
దేశాన్ని ప్రాంతాల వారీగా విభజించే ‘ఉత్తరాది వర్సెస్ దక్షిణాది’ వాదనలను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానమిచ్చారు. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న ఆందోళనలను కొట్టిపారేస్తూ, ఈ సభలో అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు.

‘ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి పెద్ద రాష్ట్రాలకు ఎంతటి గౌరవం ఉందో, దక్షిణాది రాష్ట్రాలకు, చివరికి లక్షద్వీప్ వంటి చిన్న ప్రాంతానికి కూడా అంతే హక్కులు ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని ప్రాంతాల వారీగా విడగొట్టే ప్రయత్నం చేయకండి’ అని విపక్షాలను అమిత్​ షా హెచ్చరించారు.