పంజాబ్ ఆరోగ్యమంత్రిపై ప్రతిపక్షాల ఆగ్రహం

పంజాబ్ ఆరోగ్యమంత్రిపై ప్రతిపక్షాల ఆగ్రహం

చంఢీఘ‌డ్‌ : పంజాబ్ ఆరోగ్య‌శాఖ మంత్రి చేత‌న్ సింగ్ జౌరామాజ్రా తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఫరీద్‌కోట్‌లోని బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజ్ బహదూర్ తీరు పట్ల మంత్రి చేతన్ ప్రవర్తించిన విధానాన్ని ప్రతిపక్ష నాయకులు తప్పుపడుతున్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు కూడా ఉండడం లేదని, సరైన వైద్యం అందడం లేదని ఆరోగ్యశాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో తనిఖీల కోసం మీడియా ప్రతినిధులు, ఉన్నతాధికారులను వెంటబెట్టుకుని మంత్రి చేతన్ సింగ్.. ఫ‌రీద్‌కోట్‌లోని బాబా ఫ‌రీద్ యూనివ‌ర్సిటీకి వెళ్లారు. 

హాస్పిట‌ల్‌లో ఉన్న బెడ్ల‌ను ప‌రిశీలించారు. అవి పాడైపోవ‌డాన్ని చూసి వైస్ ఛాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ రాజ్ బ‌హ‌దూర్‌పై మంత్రి చేత‌న్ సింగ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పూర్తిగా ధ్వంస‌మైన బెడ్ల‌పై పేషెంట్లు ఎలా ప‌డుకుంటార‌ని నిల‌దీశారు. పనికిరాకుండా..పాడైపోయిన బెడ్‌పై ప‌డుకోవాలంటూ వైస్ ఛాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ రాజ్ బ‌హ‌దూర్‌ ను ఆదేశించారు. దీంతో భయపడ్డ వ‌ర్సిటీ వీసి బెడ్‌పై పడుకున్నాడు. వైస్ ఛాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ రాజ్ బ‌హ‌దూర్‌ పట్ల మంత్రి చేత‌న్ వ్యవహరించిన తీరుపై విప‌క్షాలు భగ్గుమంటున్నాయి. ఆమ్ ఆద్మీ చీప్ ట్రిక్స్‌కు పాల్ప‌డుతోంద‌ని ఆరోపిస్తున్నాయి. ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న మెడిక‌ల్ స్టాఫ్‌ను మాన‌సికంగా నిర్వీర్యం చేస్తాయని విప‌క్షాలు విమ‌ర్శించాయి.


అవినీతి ఆరోపణలు రావడంతో అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింగ్లాను మంత్రివర్గం నుండి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ ఏడాది మేలో తొలగించిన విషయం తెలిసిందే.