ఫ్రీ జర్నీకి ఒరిజినల్ ఐడీ తప్పనిసరి .. పాన్ కార్డ్ చెల్లదు : సజ్జనార్

ఫ్రీ జర్నీకి ఒరిజినల్ ఐడీ తప్పనిసరి ..  పాన్ కార్డ్ చెల్లదు : సజ్జనార్

హైదరాబాద్, వెలుగు: మహాలక్ష్మి ఫ్రీ జర్నీ స్కీమ్ కు ఒరిజినల్ ఐడెంటిటి కార్డ్​ తప్పనిసరి అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి స్పష్టం చేశారు. ఒరిజినల్ ఐడీలో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలన్నారు. పాన్ కార్డ్ లో అడ్రస్ ఉండదని, దీంతో అది చెల్లదని ఆయన సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఇతర ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డు అయినా అంగీకరిస్తామని సోమవారం ఓ ప్రకటనలో ఎండీ వెల్లడించారు. గత నెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో  ఫ్రీ జర్నీ స్కీమ్ అమలవుతోంది. అయితే, బస్సుల్లో ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించటంలేదని, మొబైల్ ఫోన్లు, జిరాక్స్ కాపీలు తీసుకొస్తున్నారని, ఒరిజినల్ కార్డ్ అడిగితే తమతో గొడవ పెట్టుకుంటున్నారని, ఇతర ప్యాసింజర్లకు ఇబ్బంది అవుతోందని కండక్టర్లు పెద్ద ఎత్తున ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ వివరణ ఇచ్చారు. 

మహిళా ప్రయాణికులందరూ ఒరిజినల్‌‌‌‌ గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్‌‌‌‌ తీసుకోవాలని సూచించారు. ఒరిజినల్​ఐడీ లేకుంటే కచ్చితంగా డబ్బు చెల్లించి టికెట్‌‌‌‌ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.   మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రాంత మహిళలకే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలు చార్జీ చెల్లించి విధిగా టికెట్‌‌‌‌ తీసుకుని సహకరించాలని ఆయన కోరారు.  'ఎలాగూ ఫ్రీనే కదా.. జీరో టికెట్‌‌‌‌ ఎందుకు తీసుకోవడం..' అని కొందరు సిబ్బందితో వాదనకు దిగుతున్నారని,  ఇది సరికాదని ఎండీ అన్నారు. జీరో టికెట్ల జారీ ఆధారంగానే ఆ డబ్బును ఆర్టీసీకి ప్రభుత్వం రీయింబర్స్‌‌‌‌ చేస్తుందని తెలిపారు. జీరో టికెట్‌‌‌‌ లేకుండా ప్రయాణిస్తే..  సంస్థకు నష్టం చేసిన వాళ్లవుతారని ఆయన హెచ్చరించారు. జీరో టికెట్ లేకుండా ప్రయాణించి చెకింగ్ లో దొరికితే రూ.500 ఫైన్ విధిస్తామన్నారు.  

సంక్రాంతి సర్వీసులపై రివ్యూ 

సంక్రాంతికి స్పెషల్​ బస్సులు సజావుగా నడిచేలా సహకరించాలని ట్రాఫిక్ పోలీసులను రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీధర్ కోరారు. సోమవారం ఎంజీబీఎస్ లో సంక్రాంతి సర్వీసులపై ఆర్టీసీ విజిలెన్స్, ట్రాఫిక్, ఏపీ, కర్నాటక ఆర్టీసీ అధికారులతో ఆయన సమావేశ మయ్యారు. సంక్రాంతికి స్పెషల్ బస్సులు నడుపుతున్న నేపథ్యంలో ఎంజీబీఎస్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్యాసింజర్లు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆర్​ఎం శ్రీధర్ కోరారు.