విద్యార్థుల ఆందోళనతో ఓయూ పరీక్షలు వాయిదా

విద్యార్థుల ఆందోళనతో ఓయూ పరీక్షలు వాయిదా

ఓయూ,వెలుగు : పీజీ రెండో, నాలుగో సెమిస్టర్​ పరీక్షలు వాయిదా  వేయాలంటూ విద్యార్థులు రెండు రోజులుగా చేస్తున్న ఆందోళనను గురువారం అధికారుల హామీతో విరమించారు. 15రోజుల పాటు వాయిదా వేసేందుకు అంగీకరించిన అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. సిలబస్​పూర్తి కాకుండానే ఈనెల 28 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు టైమ్​టేబుల్​జారీ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీనిపై  తొలుత అకడమిక్​ సమస్యలు తలెత్తుతాయని, పరీక్షలు వాయిదా వేయలేమంటూ అధికారులు తేల్చిచెప్పారు. పరీక్షలు వాయిదా వేసేంత వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ విద్యార్థులు వర్షంలోనే పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఓయూ అధికారులు విద్యార్థులతో చర్చలు జరిపారు. పరీక్షలను వాయిదా వేసేందుకు చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమిస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే.. శనివారం పరీక్షలు వాయిదా ఉత్తర్వులు జారీ చేశాకే ఇంటర్నల్​పరీక్షలు రాస్తామని విద్యార్థులు స్పష్టంచేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సమావేశంలో చర్చిస్తామని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ వివరించారు. ఓయూ క్యాంపస్, నిజాం కాలేజీ, సైఫాబాద్ సహా పలు కళాశాల విద్యార్థులు వీసీ, రిజిస్ట్రార్ లతో సమావేశమైన వారిలో ఉన్నారు.