మనోళ్ల ఈ-స్కూటర్​.. ఈప్లూటో వచ్చేసింది

మనోళ్ల ఈ-స్కూటర్​..  ఈప్లూటో వచ్చేసింది

తయారు చేసిన ప్యూర్​ఈవీ స్టార్టప్​.. ఐఐటీ హెచ్​ టెక్నికల్​ సాయం

హైదరాబాద్, వెలుగు:మొట్టిమొదటి సారిగా తెలుగోళ్లు తయారు చేసిన ఈ–స్కూటర్​ మార్కెట్​లోకి వచ్చింది. ఐఐటీ హైదరాబాద్​ ఇంక్యుబేషన్​ సెంటర్​లో పురుడు పోసుకున్న ‘ప్యూర్​ఈవీ’ అనే స్టార్టప్​ ‘ఈప్లూటో7జీ’ అనే కరెంట్​ స్కూటర్​ను తయారు చేసింది. అందుకు ఐఐటీ హెచ్​ టెక్నికల్​ సపోర్ట్​ను అందించింది. స్కూటర్ల తయారీ కోసం దాదాపు 18 వేల చదరపుటడుగుల విస్తీర్ణంలో ప్యూర్​ఈవీ ప్లాంట్​ను ఏర్పాటు చేసింది. ఆదివారం ఐఐటీ హైదరాబాద్​ క్యాంపస్​లో ఈప్లూటో7జీని ఘనంగా లాంచ్​ చేశారు. కార్యక్రమానికి నీతిఆయోగ్​ సభ్యుడు వి.కె. సారస్వత్​, డీఆర్డీవో చైర్మన్​ డాక్టర్​ జి. సతీశ్​ రెడ్డి, ఐఐటీ హెచ్​ ప్రొఫెసర్లు పాల్గొన్నారు. రవాణా వ్యవస్థలో కరెంట్​ బండ్లు మంచి మార్పును తీసుకొస్తాయని, ఆధునిక రవాణా రంగానికి ఎలక్ట్రానిక్​ ట్రాన్స్​పోర్టేషన్​ కీలకం అవుతుందని వి.కె. సారస్వత్​ అన్నారు. ప్యూర్​ఈవీ స్టార్టప్​, ఈ ప్రాజెక్ట్​ను ప్రారంభించిన మొదట్లో తానూ అందులో భాగస్వామినయ్యానని, ఇప్పుడు దానిని ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నానని అన్నారు. ఐఐటీ హెచ్​ ఇన్నోవేషన్స్​కు ఇది ఈప్లూటో హాల్​మార్క్​ లాంటిదన్నారు. బండిలోని సప్లై చెయిన్​ బ్యాటరీకి చాలా ప్రాముఖ్యం ఉందని అన్నారు. ఈప్లూటోలో వాడిన బ్యాటరీ, థర్మల్​ మేనేజ్​మెంట్​ సిస్టమ్​, ఇంటిగ్రేషన్​, కంట్రోల్స్​ను పూర్తిగా దేశంలోనే తయారు చేశారని ఆయన చెప్పారు. దాదాపు 70 శాతం మెటీరియల్​ను కంపెనీనే సొంతంగా తయారు చేసుకుందన్నారు. ఈ ఫ్లూటో 7జీ వెహికిల్​ బాగుందని డీఆర్డీవో చైర్మన్​ జి. సతీశ్​ రెడ్డి అన్నారు. లిథియం బ్యాటరీస్​, ఎలక్ట్రిక్​ వెహికిల్స్​ రావడం సంతోషంగా ఉన్నారు. మిలటరీ టెక్నాలజీలోనూ ఇన్నోవేషన్స్​ జరుగుతున్నాయన్నారు.

5 గంటల చార్జింగ్​.. 120 కిలోమీటర్ల జర్నీ

రెండు రకాల మోడళ్లను కంపెనీ తీసుకొస్తోంది. ఈప్లూటో, ఈప్లూటో7జీ. ఈప్లూటో టాప్​ స్పీడ్​ 25 కిలోమీటర్లు కాగా, ఒక్కసారి చార్జింగ్​ పెడితే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. 1.8 కిలోవాట్ల బ్యాటరీని దీంట్లో ఏర్పాటు చేశారు. ఈప్లూటో7జీ వెర్షన్​లో 60 కిలోమీటర్ల స్పీడ్​ వరకు వెళ్లొచ్చు. ఒక్కసారి చార్జింగ్​ చేస్తే 90 నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఇందులో 2.5 కిలోవాట్ల పేటెంటెడ్​ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఎకో మోడ్​లో అయితే 120 కిలోమీటర్లు, ఐసీఏటీ మోడల్​లో 116 కిలోమీటర్లు, స్పోర్ట్స్​ మోడల్​లో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చట. కేవలం 5 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైచ్​ డైరెక్టర్​ ప్రొఫెసర్​ బి.ఎస్​. మూర్తి, ప్యూర్​  ఎనర్జీ సీఈవో రోహిత్​ వడేర, ప్యూర్​ఈవీ మాన్యుఫ్యాక్చరింగ్​ యూనిట్​ అసోసియేట్​ ప్రొఫెసర్​ డాక్టర్​ నిశాంత్​ డొంగరి పాల్గొన్నారు.

see also: పిల్లి కాదు.. పులి

మరిన్ని వార్తల కోసం