ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలి

ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను విధుల్లోకి  తీసుకోవాలి

హైదరాబాద్: ఇటీవల జరిగిన బదిలీల నేపథ్యంలో ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు రోడ్డున పడ్డారని... వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఔట్ సోర్సింగ్  పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ... 317 జీవో, జోనల్ బదిలీల వల్ల ఔట్ సోర్సింగ్ కార్యదర్శుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని కృష్ణయ్య వాపోయారు. నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో సీనియర్లను నియమించడంతో...దాదాపు 800 మంది ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల బతుకులు ఆగం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

2018లో రాసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్షలో ఉన్న మెరిట్ లిస్ట్ ఆధారంగా ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల నియామకం జరిగిందని, ఇప్పటికే వీరిలో కొంతమందిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా తీసుకున్నారన్నారు. ఈ క్రమంలోనే మిగిలిన ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు కూడా తమని జేపీఎస్లుగా చేస్తారని గంపెడు ఆశలు పెట్టుకుంటే.. ఇలా విధుల్లో నుంచి తీసేయడమేంటని కృష్ణయ్య ప్రశ్నించారు. తక్షణమే ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే ఈనెల 7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

మరిన్ని వార్తల కోసం..

డోజ్‌‌‌‌కాయిన్లూ డొనేట్ చేయొచ్చు: ఉక్రెయిన్ రిక్వెస్ట్

ఈ కిచెన్ లో రోజుకు 18 వేల మందికి వంట చేయొచ్చు