- ప్రారంభమైన 16వ కమిషన్ ఫండ్స్
- బకాయిలు, కొత్త నిధులు రావాలంటే ఎన్నికలు నిర్వహించాల్సిందే
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో వందల కోట్ల గ్రాంట్లు ఆగిపోయాయి. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంతో విడతలవారీగా నిధులు విడుదల చేసింది.
అయితే, కేంద్రం ఆర్థిక సంఘం నిధుల్లో 80 శాతం పంచాయతీలకు.. 15 శాతం పరిషత్‌లకు కేటాయిస్తున్నది. పరిషత్ ప్రజాప్రతినిధులు లేనిదే నిధులు విడుదల చేసే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఇప్పటికే 15వ ఆర్థిక సంఘం గడువు ముగిసి.. 16వ ఆర్థిక సంఘం పీరియడ్ ప్రారంభమైనా.. ఎన్నికల నిర్వహణపై స్పష్టత లేకపోవడంతో నిధుల రాకపై నీలినీడలు కమ్ముకున్నాయి.
పాలకవర్గాలు కొలువుదీరితేనే..
కేంద్ర ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం.. స్థానిక సంస్థల్లో ఎన్నికైన పాలకవర్గాలు ఉన్నప్పుడే నిధులను విడుదల చేస్తారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. అప్పటినుంచి ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల 15వ ఆర్థిక సంఘం కోటా కింద రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.400పైగా కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. గత మార్చితోనే 15వ ఆర్థిక సంఘం గడువు ముగియగా.. ఏప్రిల్ నుంచి 16వ ఆర్థిక సంఘం అమల్లోకి వచ్చింది. అయితే, పాత బకాయిలు రావాలన్నా, కొత్త నిధులు కేటాయించాలన్నా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
16వ ఆర్థిక సంఘం నిధులకూ ముప్పే
ఇటీవల కేంద్రం విడుదల చేసిన16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల్లో నిబంధనలు కఠినంగా ఉన్నాయి. స్థానిక సంస్థలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కేంద్రం నేరుగా నిధులను బదిలీ చేస్తున్నది. ఎన్నికలు జరపని పక్షంలో ఆయా రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లలో కోత విధించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి ఎన్నికలు నిర్వహించకపోతే.. వచ్చే ఐదేండ్లపాటు రావాల్సిన నిధులను రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది.
