గాంధీ భ‌వ‌న్ లో ఘ‌నంగా పీవీ శత జయంతి వేడుకలు

గాంధీ భ‌వ‌న్ లో ఘ‌నంగా పీవీ శత జయంతి వేడుకలు

హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు శత జయంతి వేడుక‌లు శుక్ర‌వారం గాంధీభ‌వ‌న్ లో ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను ఉద్దేశించి ఆన్ లైన్ లో మాట్లాడారు మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం. మ‌న్మోహ‌న్ సింగ్ మాట్లాడుతూ..పీవీ శతజయంతి వేడుకల నిర్వహణ మంచి నిర్ణయమ‌ని.. పీవీ క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆదర్శవంతమైన వ్యక్తి పీవీ అని.. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప ప్రధాని పీవీ అన్నారు. దేశక్లిష్ట సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారని.. పీవీ ఆర్థిక సంస్కరణల వల్లనే దేశం ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు తెచ్చిన గొప్ప నాయకుడు పీవీ అన్నారు మ‌న్మోహ‌న్ సింగ్.

చిదంబ‌రం మాట్లాడుతూ..పీవీ శత జయంతి నిర్వహణ అభినందనీయమ‌ని, పీవీ నన్ను రాజకీయాల్లో ఎంతో ప్రోత్సహించార‌న్నారు. ఆయనతో ఎంతో అనుబంధం ఉందని.. యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న నన్ను..ఎంపీగా..పీసీసీగా ప్రోత్సహించారన్నారు. పీవీ పారిశ్రామిక విధానం మరువలేనిదని.. ఆర్థిక సంస్కరణల రూపకర్త పీవీ అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పెద్దపీట వేశారని తెలిపారు చిదంబ‌రం.

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..పీవీ ఓ సామాన్య కార్యకర్తగా పని చేసి…ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు. పీవీ నాకు వ్యక్తిగతంగా మంచి పరిచయమ‌ని.. భూసంస్కరణలు తెచ్చిన ఘనత పీవీదన్నారు. పీవీ పుట్టుక నుండి..చనిపోయే వరకు కాంగ్రెస్ వాదీ అని.. ఉమ్మడి రాష్ట్రంలో పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశామ‌ని.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దేశాన్ని అదుకున్నది పీవీ సంస్కరణలే అన్నారు. జూలై 24, 1991 నాటి కేంద్ర బడ్జెట్ మన దేశ ఆర్థిక పరివర్తనకు మార్గం సుగమం చేసిందని చెప్పారు. పి.వి. నరసింహారావు పదవీకాలం అనేక రాజకీయ, సామాజిక, విదేశాంగ విధాన విజయాలకు నాంది అని తెలిపారు ఉత్త‌మ్.

ఈ కార్య‌క్ర‌మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీవీ సోదరులు మనోహర్ రావ్, పీవీ శత జయంతి కమిటీ చైర్మన్ గీతారెడ్డి, కన్వీనర్ మహేష్ గౌడ్, ముఖ్యనాయకులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, మల్లు రవి, త‌దిత‌ర కాంగ్రెస్ నేత‌లు పాల్గొన్నారు.