దేశవ్యాప్తంగా ప్రజలందరూ గత నెల 29న అదే ఎన్నికలు ముగియగానే మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతుందని కంగారు పడ్డారు. అబ్బే అలాంటి ఆలోచనే లేదంటూ క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల్లోనే.. మే డే రోజున కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లను దాదాపు రూ.వెయ్యి పెంచేసింది. సర్లే ఇక్కడితో అంతా ముగిసిందిగా అని కొందరు అనుకుంటే.. మరికొందరు మాత్రం ఇంధన ధరల పెంపు ఉంటుందని వాదించారు. మెుత్తానికి ఎలక్షన్ రిజల్ట్స్ మే 4న వస్తుండగా త్వరలోనే పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు ఉండనుందని సమాచారం.
మార్చి నెలలో కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఆయిల్ కంపెనీలు లీటర్ పెట్రోలుపై రూ.24, లీటర్ డీజిల్ కి రూ.30 చొప్పున నష్టపోతున్నాయని ప్రకటించారు. దీంతో రోజూ సదరు కంపెనీలకు వేల కోట్లలో నష్టాలు వస్తున్నాయని కానీ ప్రజల కోసం తాము రేట్లు పెంచటం లేదని అప్పట్లో చెప్పారు. అయితే ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేటు అటూ ఇటుగా 100 డాలర్లకు దగ్గరలోనే కొనసాగుతుండటంతో ఎక్కువ రోజుల పాటు ఇలా రేట్లను పెంచకుండా నిరోధించటం కుదరదని మోడీ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
►ALSO READ | వైరల్ అవుతున్న రజనీకాంత్ హాట్ కామెంట్స్: టీవీకే గెలుపు పై సోషల్ మీడియాలో చర్చ..
ఇప్పటికే దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు ఆయిల్ కంపెనీలు నిరంతరం కేంద్ర పెట్రోలియం, ఆర్థిక మంత్రిత్వ శాఖలతో చర్చిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు గురించి చర్చలు సాగుతున్నాయని తెలిపారు. దీంతో కొండలా పేరుకుపోతున్న నష్టాల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఆయిల్ కంపెనీలకు మోడీ సర్కార్ అవకాశం కల్పిస్తుందని.. దీంతో మరికొద్ది రోజుల్లోనే పెట్రోల్ డీజిల్ రేట్ల పెంపు గురించి ఒక ప్రకటన బయటకు రావొచ్చని తెలుస్తోంది.
సరఫరాలో అంతరాయాలు ఉన్నందున రేట్లను ఎక్కువ కాలం పెరగకుండా హోల్డ్ చేయటం సరైనది కాదని ఆయిల్ కంపెనీలు వాధిస్తున్నాయి. ఏదో ఒక దశలో రేట్ల పెంపు తప్పదని మరో సీనియర్ ప్రభుత్వ అధికారి చేసిన కామెంట్స్ కూడా ఇంధన ధరల పెరుగుదలకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. మెుత్తానికి ఎన్నికల ఫలితాల సెలబ్రేషన్స్ పూర్తి కాగానే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని అర్థం అవుతోంది. అయితే లీటరుకు ఈ పెంపు రూ.25 నుంచి రూ.35 మధ్య ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. ఆదాయం పెరగకపోయినా ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
