హైదరాబాద్, వెలుగు: కరోనా టైం(2019)లో రైతుబంధు పథకం అమలును ప్రభుత్వం కొంతమందికి నిలిపివేయడాన్ని హైకోర్టు సమర్థించింది. రైతుబంధు చెల్లించాంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. 2019లో ఖరీఫ్, రబీ సీజన్‌లకు రైతుబంధు చెల్లించకపోవడాన్ని సవాలు చేస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ, తెలగారం రెవెన్యూ గ్రామాలకు చెందిన టి.వెంకటనారాయణ మరో నలుగురు రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన సింగిల్ జడ్జి రైతుబంధు చెల్లించాలంటూ తీర్పు వెలువరించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు ధాఖలు చేసింది. దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. వాదనల అనంతరం కోర్టు స్పందిస్తు.. బడ్జెట్ కేటాయింపులు లేని మొత్తాన్ని చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది.
