ఎల్‌‌‌‌ నినో ఎఫెక్ట్.. ధాన్యం వేలం రద్దు.. 12 లక్షల టన్నుల ధాన్యం టెండర్లు క్యాన్సిల్

ఎల్‌‌‌‌ నినో ఎఫెక్ట్..  ధాన్యం వేలం రద్దు.. 12 లక్షల టన్నుల ధాన్యం టెండర్లు క్యాన్సిల్
  • నిర్ణయించిన రేటు కన్నా తక్కువ కోట్ చేసిన బిడ్డర్లు
  • అగ్గువకు దక్కించుకునేందుకు మిల్లర్ల యత్నం
  • ఈలోగా మనసు మార్చుకున్న ప్రభుత్వం
  • మిల్లింగ్ చేసి పీడీఎస్​ అవసరాలకు వాడుకోవాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ఎల్‌‌నినో ప్రభావంతో వానాకాలం సీజన్‌‌లో ధాన్యం దిగుబడులు తగ్గి బియ్యం కొరత ఏర్పడవచ్చన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. గత వానాకాలం సీజన్‌‌కు సంబంధించి మిల్లర్ల వద్ద మిగిలిపోయిన సన్న ధాన్యాన్ని గ్లోబల్ ఈ-వేలం ద్వారా విక్రయించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్పటికే ఆహ్వానించిన టెండర్లను రద్దు చేయాలని, ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి స్టేట్ పూల్ కింద పీడీఎస్ అవసరాలకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా పౌరసరఫరాల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

12 లక్షల టన్నుల మిగులు ధాన్యం

గత వానాకాలం సీజన్‌‌లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి 72 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి సీఎంఆర్ కోసం మిల్లులకు కేటాయించింది. కేంద్రం కోటా, రాష్ట్ర అవసరాలకు నిల్వ ఉంచిన ధాన్యం పోగా మరో 12 లక్షల టన్నుల సన్నవడ్లు మిగిలాయి. ఇందులో తొలి విడత ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని 11 లాట్లుగా వేలం వేసేందుకు గ్లోబల్ ఈ–-టెండర్లను ఆహ్వానించింది. టన్ను వడ్లకు ప్రభుత్వం కనీస ధర రూ.34,050గా నిర్ణయించింది. 

కానీ టెండర్లలో పాల్గొన్న మిల్లర్లు, వ్యాపారులు టన్నుకు రూ.24 వేల నుంచి రూ.27 వేల ధర మాత్రమే కోట్ చేశారు. టన్నుకు రూ.7 వేల నుంచి రూ.10 వేల తక్కువ రేటుకు బిడ్లు దాఖలయ్యాయి. మిల్లర్లంతా కూడబలుక్కుని తక్కువ ధరలు కోట్ చేయగా, ప్రభుత్వానికి భారీ మొత్తంలో నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. 
 

ఎల్‌‌నినో అంచనాలతో మారిన వ్యూహం

ఎల్‌‌నినో ప్రభావంతో ఈసారి ధాన్యం దిగుబడులు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.  రాష్ట్రంలో వానాకాలం వరి సాగు విస్తీర్ణం 60 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది ఇప్పటికి  కేవలం11.02 లక్షల ఎకరాల్లోనే వరినాట్లు పడ్డాయి.  ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా గోదావరి, కృష్ణా, వాటి ఉపనదులకు వరదల్లేక ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. గ్రామాల్లో చెరువులు కూడా నిండలేదు. అటు భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లు, బావుల కింద కూడా వరినాట్లు అంతంతే పడ్డాయి.

ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో వరి సాగు విస్తీర్ణం 30 లక్షల ఎకరాలు దాటడం కష్టమేననే అంచనాలున్నాయి. మరోవైపు ఎల్​నినో పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో ఇప్పటికే సన్న బియ్యం ధరలు పెరుగుతున్నాయి. దీంతో మున్ముందు పీడీఎస్‌‌ బియ్యానికి కొరత రావచ్చునని ప్రభుత్వం భావిస్తున్నది. 

అందువల్లే మిల్లర్ల వద్ద మిగిలిపోయిన సన్న ధాన్యాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని మిల్లింగ్ చేయించి స్టేట్ పూల్ ద్వారా రేషన్ బియ్యం అవసరాలకు వినియోగించాలని నిర్ణయం తీసుకుంది.