డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 1944వ సంవత్సరం కాకినాడలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించబోతుండగా ఖద్దరు పంచె, లాల్చి, శాలువా ధరించిన ఒక యువకుడు కవిత చదువుతానంటూ వేదిక మీదకు వచ్చాడు. ఆ యువకుడు అంబేద్కర్ గురించి తాను రాసిన ఆంగ్ల కవితను అత్యంత లయబద్ధంగా చదివాడు. కవిత విని ఎంతో ముగ్ధుడైన అంబేద్కర్ ఆ యువకుడితో కరచాలనం చేసి అభినందించాడు. అంబేద్కర్ చొరవతో ఆ కవిత కొన్నాళ్ల తరువాత కలకత్తా నుంచి వెలువడే ‘పీపుల్స్ హెరాల్డ్’ పత్రిక సంపాదకీయంగా ప్రచురించింది.
డా క్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రశంసలందుకున్న ఆ కవిపేరు పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న. గబ్బిలం కావ్యంలో అంబేద్కర్ గురించి ‘అతనిమెప్పుల్ నీ జయారంభముల్’ అని జాషువా కీలకంగా వ్యాఖ్యానించాడు. ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘స్వతంత్ర విప్లవ జ్వాల’గా అనునిత్యం ప్రభాసించిన మహాకవి బోయి భీమన్న. మట్టినారాధించే పాలేరులకు, సమాజ పీడితులకు అక్షరాల పల్లకీ మోసిన ‘బోయి’ భీమన్న. ‘కుల, మత విభేద రహితమైన భారతజాతి ఆవిర్భవించాలనేదే నా ధ్యేయం’ అంటూ కలమెత్తి నినదించి ఈ మహోన్నత ధ్యేయసాధన కోసం ఏడున్నర దశాబ్దాల తన సాహిత్యాన్ని అంకితం చేసిన ఆయన పద్మశ్రీగా, కళాప్రపూర్ణగా కవి పండితుల మన్ననలందుకున్నాడు. ‘సుకుమారంగా సొగసైన భావాలతో వ్యాకరణ శుద్ధమైన శబ్దాలతో’ పద్యాలు రాయటంలో భీమన్న చక్కని ప్రతిభను కనబరిచారని విశ్వనాథ సత్యనారాయణ ప్రస్తుతించడం విశేషంగా భావించవచ్చు.
దళితుల జీవన వేదన
‘గుడిసెలు కాలి పొతున్నై’ సంపుటిలో ప్రతీకాత్మకంగా ఈ కవి వచన కవిత్వాన్ని పండించాడు. ‘పూరి గుడిసెల్ని సృష్టించింది మేడలయితే / మేడల్ని నిర్మించింది పూరి గుడిసెలే / స్వార్ధానికి అమాయకత్వం బలి/ అమాయకత్వానికి స్వార్ధం పులి’ అంటూ దళితుల జీవన వేదనల్ని శక్తిమంతంగా వినిపించాడు. ‘ప్రభూ మా పేర్లను/ ఓటర్ల జాబితా నుంచి తొలగించి/ బానిసల జాబితాలో చేర్పించండి/ చచ్చి మీ కడుపున పుడతాం/ రకరకాల జెండాలవాళ్లు మరోపక్క మా ఊరి కామందులు ఓటు అమ్మోరు కోసం/ మా ప్రాణాలు తోడేస్తున్నారు’ (గుడిసెలు కాలి పొతున్నై) అంటూ ఎన్నికల రాజకీయాల్లోని డొల్లతనాన్ని భీమన్న వ్యంగ్యంగా తేటతెల్లం చేశాడు. భీమన్న భారతదేశ ఆధ్యాత్మిక, పౌరాణిక, సాంస్కృతిక వారసత్వానికి పునాదులు నిర్మించింది దళితులేనని తన రచనలతో సాధికారికంగా చాటిచెప్పాడు. అసలు సిసలైన భారతీయ వారసత్వ గరిమను, ఆది భారతీయుల, మూలవాసులు శ్రమమహిమను తేటతెల్లం చేశాడు.
అంబేద్కరిస్ట్ సాహిత్యానికి భీమన్న స్ఫూర్తి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాసిన ‘ఎన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని కుల నిర్మూలన (1968) పేరుతో భీమన్న అనువదించాడు. 'గొంతెత్తి నీ పాట పలికింతునా/ గంతేసి నీ బాట నడిపింతునా' అంటూ భీమన్న తన రచనల ద్వారా అంబేద్కర్ ఔన్నత్యానికి నీరాజనాలు పలికాడు. అంబేద్కర్ జీవిత ప్రస్థానాన్ని, ఆయన పోరాట నైజాన్ని, ఉద్యమ స్వభావాన్ని'అంబేద్కర్ సుప్రభాతం 'అనే పద్య కావ్యంలో సముచితంగా ఆవిష్కరించాడు.
అంబేద్కర్ వ్యక్తిత్వాన్ని, ఆయన ప్రబోధాలను , ఆలోచనల సారాంశాన్ని వివేచిస్తూ వందకు పైగా పాటలు రచించి(పాటల్లో అంబేద్కర్) ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాడు .''జయ జయ అంబేద్కర /జయ దళిత జనస్వరా/జయ భారత భాస్కరా'' అనే భీమన్న పాట తెలుగు ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది. అంటరాని వాడలో జన్మించిన భీమన్న అచంచలమైన కృషితో కాశీ విద్యాపీఠం గౌరవ డాక్టరేట్, పద్మభూషణ్, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారంతో పాటు అత్యున్నత సన్మానాలను అందుకున్నారు. అంబేద్కరిస్ట్ సాహిత్యానికి భీమన్న అందించిన తాత్త్విక స్ఫూర్తితో నేడు బోయి భీమన్న జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పిద్దాం.
- ఆచార్య కోయి కోటేశ్వరరావు
తెలుగుశాఖ హెడ్,
గవర్నమెంట్ సిటీ కాలేజ్, హైదరాబాద్.
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
[email protected]
రచన 700 పదాలకు మించరాదు.
