పాకిస్తాన్ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ : రాత్రి 8 గంటలకే అన్నీ క్లోజ్.. పెళ్లిళ్లు, పేరంటాలు కూడా..!

పాకిస్తాన్ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ : రాత్రి 8 గంటలకే అన్నీ క్లోజ్.. పెళ్లిళ్లు, పేరంటాలు కూడా..!

పాకిస్థాన్‌లో పసిర్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయ్. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న యుద్ధం చివరకు దాయాది దేశం పాకిస్థాన్‌ను చీకట్లోకి నెట్టేశాయి. హోర్ముజ్ జలసంధి గుండా ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తగా.. దాని సెగ పాకిస్థాన్‌కు బలంగా తగిలింది. దీంతో నెలకొన్న తీవ్ర ఇంధన కొరతను అధిగమించేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యవసరంగా "స్మార్ట్ లాక్ డౌన్" విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్, నేపాల్ వంటి పొరుగు దేశాలు ఈ సంక్షోభాన్ని తట్టుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ.. ఆర్థికంగా బలహీనంగా ఉన్న పాక్ మాత్రం చేతులెత్తేసి నియంత్రణల బాట పట్టింది.

పాకిస్థాన్‌లోని పంజాబ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్ సహా అన్ని ప్రధాన ప్రాంతాల్లో మార్కెట్లు, షాపింగ్ మాల్స్, వాణిజ్య కేంద్రాలను రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశించారు. కేవలం మెడికల్ షాపులు, ఫార్మసీలకు మాత్రమే రూల్స్ నుండి మినహాయింపును కలిగి ఉన్నాయి. పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించి.. విద్యుత్తును ఆదా చేయడం ద్వారా ఈ గండం నుంచి గట్టెక్కాలని పాక్ సర్కార్ భావిస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో స్వల్ప సడలింపులు ఇచ్చినప్పటికీ.. డిపార్ట్‌మెంటల్ స్టోర్లు, మాల్స్ కు మాత్రం ఖచ్చితంగా 8 గంటలకే తాళాలు పడాల్సిందే.

ఇక పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లపై కూడా పాక్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. శుభకార్యాలు జరిగే హాల్స్, మార్క్యూలు, రెస్టారెంట్లు రాత్రి 10 గంటల కల్లా మూసేయాల్సిందేనని షరతు పెట్టింది. చివరికి ఇళ్లలో చేసుకునే ప్రైవేట్ వేడుకలను కూడా రాత్రి 10 గంటల తర్వాత నిర్వహించకూడదని నిషేధం విధించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండే ఈ స్మార్ట్ లాక్ డౌన్ రూల్స్ పాకిస్థాన్ వ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాత్రి పూట పాకిస్థాన్ వీధులన్నీ కర్ఫ్యూను తలపిస్తూ బోసిపోనున్నాయి. క్రూడ్ ధరలు ఆకాశాన్ని తాకడం, సరఫరా లేకపోవడంతో పాక్ ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది.

ALSO READ : టర్కీలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ దగ్గర కాల్పులు.. 

ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని కొంత తగ్గించేందుకు గిల్గిత్, ముజఫరాబాద్ వంటి నగరాల్లో నెల రోజుల పాటు ఉచిత ప్రజా రవాణాను ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అయ్యే ఖర్చును అక్కడి గవర్నమెంట్ భరించనుంది. డిప్యూటీ పీఎం ఇషాక్ దార్, ప్లానింగ్ మినిస్టర్ అహసాన్ ఇక్బాల్ వంటి అగ్రనేతలు ఈ సంక్షోభ నివారణా చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇరాన్-అమెరికా గొడవ సద్దుమణిగి ఇంధన సరఫరా పునరుద్ధరించబడే వరకు పాకిస్థాన్‌కు ఈ చీకటి రోజులు తప్పేలా లేవు. దాయాది దేశం ఎదుర్కొంటున్న ఈ కష్టాలు అక్కడి ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీసే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.