అంకారా: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చిన వేళ టర్కీలో కాల్పులు కలకలం రేపాయి. మంగళవారం (ఏప్రిల్ 7) ఇస్తాంబుల్‌లో ఉన్న ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనం సమీపంలో గుర్తు తెలియని దుండగులు, పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు దుండగులు భద్రతా దళాల చేతిలో హతమయ్యారు.
ఇద్దరు పోలీసులు గాయపడ్డారని టర్కీష్ మీడియా నివేదించింది. కాల్పుల నేపథ్యంలో ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనాన్ని పూర్తిగా భద్రతా దళాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.
టర్కీ అధికార వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం టర్కీలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తలు ఎవరూ లేరు. 2023, అక్టోబర్ 7న జరిగిన గాజా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్, టర్కీల మధ్య సంబంధాలు క్షీణించాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడిని టర్కీ తీవ్రంగా విమర్శించింది. ఈ దాడికి నిరసనగా తమ దేశంలోని ఇజ్రాయెల్ కాన్సులేట్‌ను క్లో్జ్ చేసింది టర్కీ.
