V6 News

శిలాఫలకంపై తన పేరు పెట్టలేదని సర్పంచ్ ఆగ్రహం

శిలాఫలకంపై తన పేరు పెట్టలేదని సర్పంచ్ ఆగ్రహం
  • స్పందించిన రాష్ట్రపతి కార్యాలయ సెక్రెటరీ
  • విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్టేట్​ చీఫ్​ సెక్రెటరీకి సిఫార్సు   

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ములుగు కలెక్టర్ తనను అవమానపరిచారని ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట సర్పంచ్ డోలు రజిత రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఎంపీపీ, జడ్పీటీసీ, వివిధ గ్రామాల సర్పంచ్ ల సమక్షంలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 28న రాష్ట్రపతి ప్రారంభించిన శిలాఫలకాలపై తన పేరు పెట్టించకుండా అవమానించారని, సర్పంచ్​గా తనకు ఇవ్వాల్సిన ప్రొటోకాల్​ మరిచిపోయారన్నారు. 

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో 15 రోజులుగా అహర్నిశలు పనిచేసిన తనకు సరైన గుర్తింపు లభించకపోగా అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులైన కలెక్టర్, జిల్లా యంత్రాంగం పై చర్యలు తీసుకోవాలని కంప్లయింట్​ చేశారు. అంతకుముందే సర్పంచ్ కు అవమానం జరిగిందని, చర్యలు తీసుకోవాలని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి ములుగు జిల్లా అధ్యక్షుడు పామిడి శ్రీధర్ రావు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. స్పందించిన రాష్ట్రపతి కార్యాలయ సెక్రెటరీ పీసీ మీనా..తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీకి ఏం జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకోవాల్సిందిగా సిఫార్సు చేశారు.