- సీఎం రేవంత్ పర్యటనతో ప్రాజెక్టుల పనుల్లో వేగం: మంత్రి ఉత్తమ్
- అక్కడే రివ్యూ చేసి నిధులు విడుదల చేసే అవకాశం
- జలసౌధలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనతో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టుల అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సీఎం దిశా నిర్దేశం చేస్తారని, స్పాట్‌లోనే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. మంగళవారం జలసౌధలో ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే చేపట్టిన, చేపట్టబోతున్న ప్రాజెక్టుల స్థితిగతులపై సీఎం సమీక్షిస్తారని, ఏవైనా లోపాలుంటే వాటిని పరిష్కరించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తారని పేర్కొన్నారు. జిల్లాలో ప్రాజెక్టులకు సంబంధించి భారీ విధానపరమైన నిర్ణయాలను వెల్లడిస్తారని, ఆ తర్వాత ప్రాజెక్టులను సీఎం పరిశీలిస్తారని ఉత్తమ్ చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి సహా కీలక ప్రాజెక్టులకు నిధులను విడుదల చేసే అవకాశం ఉందన్నారు.
సీఎం పర్యటనకు అధికారులు పూర్తి సన్నద్ధతతో ఉండాలని, సమాచారమంతా రెడీగా ఉంచుకోవాలని సూచించారు. పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా సహా పలు లిఫ్ట్ స్కీంలపై సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. జూన్ 4న సోమశిల వద్ద ఆయా ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఉంటుందన్నారు. కాగా ప్రాజెక్టు పనుల ఏరియల్ సర్వే కోసం రెండు హెలికాప్టర్లను సిద్ధం చేయనున్నారు. సీఎంతో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పర్యటనకు రానున్నారు. ఈ రివ్యూలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
