జూన్​చివర్లో లేదా జులై మొదట్లో పంచాయతీ ఎన్నికలు.. రెడీగా ఉన్న ఎన్నికల సంఘం..!

జూన్​చివర్లో లేదా జులై మొదట్లో పంచాయతీ ఎన్నికలు.. రెడీగా ఉన్న ఎన్నికల సంఘం..!
  • కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. రెడీగా ఉన్న ఎన్నికల సంఘం
  • ఆ వెంటనే వరుసగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ,మున్సిపాల్టీలకు కూడా..
  • తాజాగా పంచాయతీలకు రూ.153 కోట్ల పెండింగ్​ బిల్లులు క్లియర్ 
  • త్వరలో దాదాపు రూ.300 కోట్లు కూడా రిలీజ్​
  • జూన్​ 2 నుంచి రాజీవ్​ యువవికాసం.. అదే నెలలో కొత్త రేషన్​ కార్డులు
  • ఇప్పటికే సీఎం జిల్లాల పర్యటనలు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీలు
  • ఇవన్నీ స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగమేనని టాక్​
  • పార్టీపరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని ఆలోచన 

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. జూన్ చివరి వారంలో లేదా జులై ప్రారంభంలో ఎన్నికలు జరపాలని ప్లాన్​ చేస్తున్నది. దీనికి కొనసాగింపుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసగా చేపట్టాలని ఆలోచిస్తున్నది. గ్రామ పంచాయతీలకు సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లులను తాజాగా క్లియర్ చేయడం, మరికొన్నింటిని త్వరలోనే క్లియర్​ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండడం,  జూన్ 2 నుంచి ‘రాజీవ్ యువ వికాసం’ స్కీమ్​ ప్రారంభిస్తుండటం, అదే నెలలో వీలైనంత మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించడం వంటి చర్యలన్నీ ఎన్నికల సన్నాహాల్లో భాగమేనన్న ప్రచారం జరుగుతున్నది. 

మరోవైపు ఇప్పటికే జిల్లాల పర్యటనలు కొనసాగిస్తున్న సీఎం రేవంత్​రెడ్డి.. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో వన్​ టు వన్​ మాట్లాడుతున్నారు. ఇది కూడా ఎన్నికల సన్నద్ధతలోనే భాగమేనని రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులకు సర్కార్​ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్న రాష్ట్ర సర్కారు.. ఆ దిశగా కార్యాచరణ ప్రారంభించింది.

పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, రాజీవ్ యువ వికాసం, రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నది. పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లుల్లో తాజాగా రూ.153 కోట్లను విడుదల చేసింది. మరికొన్ని పెండింగ్​ బకాయిలు దాదాపు రూ.300 కోట్లను కూడా త్వరలో రిలీజ్​ చేయనున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఇదంతా ఎన్నికల సన్నాహాల్లో భాగమేనన్న ప్రచారం జరుగుతున్నది. 

మరోవైపు యువతకు స్వయం ఉపాధి కోసం ‘రాజీవ్ యువ వికాసం’ కార్యక్రమాన్ని జూన్ 2 నుంచి ప్రారంభించనుంది. 5 లక్షల మందికి దీనితో లబ్ధి చేకూరనుంది. ఇందులో స్థానిక యువతతో పాటు కాంగ్రెస్​ కేడర్​కు ప్రయోజనం దక్కనుంది. జూన్​ నెలలోనే వీలైనంత మంది అర్హులకు రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. పెండింగ్​ రైతు భరోసాను కూడా ఈ నెల చివరి వారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తున్నది.  

సీఎం జిల్లాల పర్యటనలు.. ఎమ్మెల్యేలతో భేటీలు.. 

జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి వరుస పర్యటనలు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీలు కొనసాగుతున్నాయి. ఇవి కూడా స్థానిక ఎన్నికల సన్నాహాల్లో భాగమేనన్న చర్చ జరుగుతున్నది. కొన్ని వారాలుగా సీఎం వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ద్వారా స్థానిక సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. 

ఎమ్మెల్యేలతో జరిగిన భేటీల్లోనూ ఎన్నికల సన్నద్ధత, స్థానిక నాయకులతో సమన్వయం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సందేశాల గురించి ప్రస్తావిస్తున్నారు. జూన్​ చివరలో లేదా జులై మొదటివారంలో స్థానిక ఎన్నికలు ఉంటాయని ఈ సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చినట్లు చర్చ జరుగుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా వివిధ అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. 

ఎన్నికల ఆలస్యం..  

గ్రామ పంచాయతీల పాలకవర్గాల గడువు గతేడాది ఫిబ్రవరిలోనే ముగియగా.. దాదాపు ఏడాదిన్నరగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,600 కోట్లకు పైగా ఆగిపోయాయి. పాలకవర్గాలు ఎన్నికైతేనే ఈ నిధులు వస్తాయి. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు నిరుడు జులై మొదటి వారంలో.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల గడువు గత నెలలోనే ముగిశాయి. 

వీటికి కూడా ఫైనాన్స్​ కమిషన్ నిధులు ఆగిపోయాయి. ప్రస్తుతం అన్నిచోట్లా ఇన్​చార్జ్‎ల పాలన నడుస్తున్నది. ఒక అధికారి ఐదారు పంచాయతీలు, మండలాలు లేదా మున్సి పాలిటీలను పర్యవేక్షిస్తుండటంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా,  కాంగ్రెస్ పార్టీ పదేండ్ల తర్వాత అధికారంలోకి రావడంతో గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు స్థానిక పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

ముఖ్యంగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ లాంటి పదవులు దక్కితే పార్టీ మరింత బలపడుతుందని కాంగ్రె స్ పెద్దలు భావిస్తున్నారు. ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో.. జూన్​ చివరి వారంలో లేదా జులై మొదటి వారం నుంచి స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. 

ఎన్నికల తేదీలపై మూడు ప్రతిపాదనలు

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్​లో ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనకు నిర్ణయం తీసుకున్నందున రాష్ట్ర బిల్లులకు ఆమోదం లభిస్తుందా లేదా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు  గ్రామాల్లో సర్పంచ్​లు లేక ఏడాదిన్నర కావస్తున్నది. దీంతో  కొన్ని నెలలుగా ఫైనాన్స్​ కమిషన్​ నిధులు ఆగిపోయి, పల్లెల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. 

పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యతిరేకత వచ్చే  ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి  ఇంటెలిజెన్స్​ వర్గాలు నివేదించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని సర్కార్​ భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అధికారులు  ఏయే తేదీల్లో ఎన్నికలు నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలను అందజేసినట్లు తెలుస్తున్నది. 

జూన్​ చివరలో, జులై మొదటివారంలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడం.. ఆ తరువాత వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లడం లాంటివి ఇందులో ఉన్నాయి. ఒకవేళ ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అయితే.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలనే ప్రపోజల్​ కూడా ఇందులో ఉంది. మరోవైపు ఇప్పటికే స్థానిక ఎన్నికలకు అన్నివిధాలా సిద్ధమైన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎలక్షన్​ డేట్స్​, రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నది.  

పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు

వాస్తవానికి పంచాయతీ ఎన్నికలను గతేడాదే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం సమగ్ర కుల గణన సర్వే చేపట్టింది. అనంతరం బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి,  ఆమోదించింది.

ఇందుకు సంబంధించిన రెండు బీసీ బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్​లో ఉన్నాయి. ఇటీవల కేంద్ర కేబినెట్​  కూడా దేశవ్యాప్తంగా జన గణనతో పాటు కుల గణన చేసేందుకు అంగీకరించింది. ఇది పూర్తయ్యేందుకు మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రం చేసిన కుల గణన వివరాల ఆధారంగా పంపిన స్థానిక బీసీ రిజర్వేషన్ల బిల్లులను రాష్ట్రపతి ఆమోదిస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 

ఇందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతోఈసారి పార్టీ పరంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఇతర పార్టీలు కూడా బీసీలకు అంతే మొత్తంలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని.. దీంతోనైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు అవుతుందని కాంగ్రెస్​ వర్గాలు అంటున్నాయి.