- పనుల పర్యవేక్షణకు 6 జిల్లాల ఆఫీసర్లకు డిప్యూటేషన్
- పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కుంభమేళ సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బంధీగా ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రాష్ట్రంతోపాటు దేశ నలుమూలల నుంచి భక్తులు తాకిడి పెరగగా..సంకాంత్రి సెలువులతో రద్దీ మరింత పెరిగింది. భక్తులంతా రెండు రోజులపాటు అక్కడే బస చేసి తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న జాతరలో పారిశుధ్య నిర్వహణను పకడ్బంధీగా చేపట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
ఇందులో భాగంగా పారిశుధ్య పనుల పర్యవేక్షణ కోసం పొరుగు జిల్లాల నుంచి అధికారులను డిప్యూటేషన్ పై నియమిస్తూ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు కలెక్టర్ విజ్ఞప్తి మేరకు జయశంకర్ భూపాలపల్లి, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల నుంచి సంబంధిత అధికారులను తక్షణమే రిలీవ్ చేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. డిప్యూటేషన్ వేసిన అధికారులు శనివారం మేడారంలోని గద్దెల సమీపంలోని డార్మిటరీ భవనంలో రిపోర్ట్ చేశారు. జాతర ముగిసే వరకు వీరు పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు.
23 మంది డీపీఓలు, 40 మంది డీఎల్పీఓలు
మేడారం జాతరలోపారిశుధ్య నిర్వహణను పంచాయతీరాజ్ శాఖ పర్యవేక్షిస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి 23 మంది జిల్లా పంచాయతీ ఆఫీసర్లను జోనల్ కోఆర్డినేటర్లుగా, 40 మంది డివిజనల్ పంచాయతీ ఆఫీసర్లను సెక్టోరల్ కోఆర్డినేటర్లుగా నియమించింది. వీరిని ములుగు కలెక్టర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
ఈ నెల 24 నుంచి జాతర ముగిసే వరకు విధుల్లో ఉండాలని సూచించింది. ములుగు డీపీవోతో సమన్వయం చేసుకుంటూ 24 గంటలు పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలని పేర్కొంది. జాతర డ్యూటీ వేసిన అధికారులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని, ఉత్తర్వులు ధిక్కరిస్తే చర్యలు తప్పవని పంచాయతీరాజ్‌శాఖ హెచ్చరించింది.
