- ఆధారాల్లేని వ్యాఖ్యలు సమాజంలో అసహనానికి దారితీస్తాయి..
- రాజ్యసభలో ఖర్గే వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నడ్డా అభ్యంతరం
- సభలో మాట్లాడేటప్పుడు అథెంటికేషన్ ఉండాలని సూచన
- ‘పేపర్ లీక్’ బిల్లుపై ఖర్గే వర్సెస్ నడ్డా
న్యూఢిల్లీ: రాజ్యసభలో ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు-2026’పై గురువారం జరిగిన చర్చ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన ‘మనుస్మృతి’ వ్యాఖ్యలు సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదానికి కారణమయ్యాయి. పాఠ్యాంశాల్లో ‘మనుస్మృతి’ అంశాలను చేర్చుతున్నారంటూ ఖర్గే ఆరోపించారు. మనుస్మృతిలోని ప్రాచీన నిబంధనలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ట్రెజరీ బెంచీల్లో ఉన్న సభ్యులు తప్పుపట్టారు. ఖర్గే ప్రసంగాన్ని అడ్డుకుంటూ బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంలో సభాపక్ష నేత జేపీ నడ్డా జోక్యం చేసుకున్నారు. ఖర్గే వ్యాఖ్యలు వాస్తవ దూరమని.. ఇది తప్పుడు సందేశాన్ని పంపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఖర్గే ఆధారాలు చూపాలి
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు, మనుస్మృతికి సంబంధం ఏమిటని నడ్డా ప్రశ్నించారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు (అథెంటికేషన్) చూపాలని, సభలో మూల ప్రతులను మాత్రమే ఉటంకించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేని వ్యాఖ్యలు సమాజంలో అసహనానికి దారితీస్తాయని పేర్కొన్నారు. ఖర్గే తన స్టేట్‌మెంట్‌ను సరిచేసుకోవాలని, ఒరిజినల్ మనుస్మృతితో చెక్ చేసుకోవాలని సూచించారు. రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. చర్చలో మనుస్మృతి ప్రస్తావన సంబంధం లేని అంశమని, రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగిస్తున్నటు చెప్పారు.
రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్
విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ తుపాకులు, తీవ్ర బలప్రయోగాన్ని ఉపయోగించారనే ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో మాట్లాడాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. గురువారం సభ ప్రారంభమై, పత్రాల సమర్పణ పూర్తయిన వెంటనే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు.
జులై 20న విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యపై హోంమంత్రి సభకు వచ్చి వివరణ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ.. రాజ్యాంగం ప్రకారం కేంద్ర కేబినెట్ పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలన్నారు. ‘‘విద్యార్థులపై లాఠీచార్జ్, కాల్పులు జరిగినప్పుడు హోం మంత్రి సభకు వచ్చి ప్రకటన చేయాలనడం సమంజసమైన డిమాండ్’’ అని అన్నారు.
అయితే పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తిరస్కరించారు. జీరో అవర్‌ను కొనసాగించారు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్ష ఎంపీలు ‘హోంమంత్రి సభకు రావాలి’, అంటూ దాదాపు అరగంటపాటు నినాదాలు చేశారు. అనంతరం తమ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో సభ నుంచి వాకౌట్ చేశారు.
