బషీర్బాగ్, వెలుగు: యుగాలు మారినా, తరాలు మారినా ప్రపంచానికి హిందూ ధర్మమే దిక్సూచిగా నిలుస్తుందని వీహెచ్‌పీ భాగ్యనగర్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల్ల సత్యం అన్నారు. ఆధునిక కాలంలో ఏఐ టెక్నాలజీ ఎంత ప్రభావితం చేసినా, సృష్టికి అసలు మూలం హిందూ ధర్మమేనన్నారు. ఉగాదిని పురస్కరించుకుని గురువారం కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో ధర్మాచార్య సంపర్క విభాగం ముద్రించిన పంచాంగాన్ని కాంతేంద్ర స్వామీజీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.. కాలమానాన్ని క్షణం, నిమిషం, దినం, వారం లెక్కలతో కచ్చితంగా చెప్పే సామర్థ్యం మన ధర్మాచార్యులకే ఉందన్నారు. అనంతరం ప్రాంత ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మాట్లాడుతూ.. ధర్మాచార్యుల మార్గదర్శనంలోనే సృష్టి మనుగడ సాగుతుందని, యువత సన్మార్గంలో నడిచి జీవితాన్ని సార్థకం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వీహెచ్‌పీ రాష్ట్ర సహకార్యదర్శి చింతల వెంకన్న, ఉపాధ్యక్షులు జగదీశ్వర్ పాల్గొన్నారు.
