పాతోళ్లు vs కొత్తోళ్లు: పరిషత్ ఎన్నికల వేళ రచ్చ

పాతోళ్లు vs కొత్తోళ్లు: పరిషత్ ఎన్నికల వేళ రచ్చ

వెలుగు: పరిషత్ ఎన్నికల వేళ అధికార పార్టీ టీఆర్ఎస్ లో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. పాత నేతలకు, కొత్త నేతలకు మధ్య టికెట్ల లొల్లినడుస్తోంది. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న తమకు టికెట్లు రాకుండా చేస్తున్నారని కొత్త నేతలపై పాత నేతలు ఫైర్ అవుతున్నారు. తమ అవకాశాలను తన్నుకు పోతున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది.

రెబల్స్ గా బరిలోకి..
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్లు ముగిశాయి. పరిషత్ఎన్నికల్లో టికెట్ కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న వారు టీఆర్ఎస్ లో చాలా మందే ఉన్నారు. ఉద్యమ సమయం నుంచి పార్టీని అంటిపెట్టుకున్న స్థానిక నేతలు ఎప్పుడో ఒకసారి పోటీ చేసే అవకాశం దక్కుతుందని ఎదురుచూస్తూ ఉన్నారు. పరిషత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వారిలో ఆశలుపెరిగాయి. కానీ.. ఇటీవల పార్టీలో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, వారి అనుచరుల వల్ల తమకు టికెట్లు దక్కడం లేదని పాత నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లు ఇచ్చే అధికారాన్ని ఎమ్మెల్యేలకే టీఆర్ఎస్ నాయకత్వం అప్పగించింది. దీంతో పార్టీలో కొత్తగా చేరిన 11 మందిఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కూడా ఆ అధికారం దక్కింది. వాళ్లు తమ అనుచరులకే టికెట్లు ఇస్తున్నట్లు పార్టీలోని పాత నేతలు భగ్గు మంటున్నారు.

వలసఎమ్మెల్యేలు, వలస నేతల తీరుకు నిరసనగా పలుచోట్ల పాత నేతలు రెబల్స్ గా బరిలోకి దిగుతున్నారు.ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఏకంగా 106మంది నామినేషన్లు వేశారు. పార్టీ కోసం ఎప్పటినుంచో పనిచేస్తున్న వారిని పక్కనబెట్టి నిన్న, మొన్నకండువా కప్పుకున్నవారికి బీఫాం ఇవ్వడం ఏమిటని తప్పుబట్టారు. వారిని ఓడించి తీరుతామని కొందరుబాహాటంగానే చెప్తున్నారు. మరికొందరు ఒకరిపైఒకరు దాడులకు దిగుతున్నారు.

బుజ్జగిస్తున్నా..
క్షేత్రస్థాయిలో నేతల వర్గపోరుపై పార్టీ పెద్దలకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది. వారిని బుజ్జగించేందుకు పార్టీ సీనియర్‌ నాయకులు రంగంలోకిదిగారు. అయినా కొన్ని చోట్ల నేతలు ససేమిరా అంటున్నారు. కొందరు నేతలు తమ బలమేంటో ఈఎన్నికల్లో చూపించి తీరుతామని, పార్టీ టికెట్లను ఎగరేసుకుపోయిన వాళను్ల ఓడిస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతల మధ్య విభేదాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపొచ్చని పార్టీవర్గాలు కలవరపడుతున్నాయి. విభేదాలు ఎక్కువగా ఉన్న జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడి సమన్వయం చేసేప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. రెబల్స్ తో నామినేషన్లు విత్‌ డ్రా చేయించాలని ఈ సందర్భంగా కోరినట్టు తెలిసింది. మిగతా జిల్లా నేతలు, ఆ జిల్లా ఇన్ చార్జిలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.