V6 News

పార్లమెంట్ నిరవధిక వాయిదా... చర్చించేందుకు ఏ అంశాలు లేకపోవడంతో..

పార్లమెంట్ నిరవధిక వాయిదా... చర్చించేందుకు ఏ అంశాలు లేకపోవడంతో..

పార్లమెంట్ ఉభయ సభలు నిరవధిక వాయిదా పడ్డాయి. మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు శనివారం ( ఏప్రిల్ 18 ) ముగిసాయి. మూడో రోజు సభలు ప్రారంభం కాగానే నిరవధిక వాయిదా వేశారు. శుక్రవారం మహిళా బిల్లు వీగిపోవడంతో ఇవాళ సభలో చర్చించటానికి ఏం లేకుండా పోయింది. దీంతో సభలను నిరవధిక వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది కేంద్రం. మహిళా బిల్లు వీగిపోవడం ఎన్డీయే ప్రభుత్వానికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ ప్రత్యేక సమావేశాల ద్వారా మూడు కీలక బిల్లులు పాస్ చేయించుకోవాలన్న కేంద్రం ప్లాన్ ఫెయిల్ అయ్యింది.

మహిళా బిల్లు రూపంలో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త జనాభా లెక్కల అవసరం లేకుండానే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి, డీలిమిటేషన్ చేపట్టి లోక్‌సభ సీట్లను పెంచడానికి ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2026 వీగిపోయింది. శుక్రవారం లోక్​సభలో జరిగిన డివిజన్​  ఓటింగ్​లో బిల్లుకు మద్దతుగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్​లో పాల్గొనగా, బిల్లు ఆమోదం పొందడానికి సభకు హాజరైనవారిలో మూడింట రెండు వంతుల మెజారిటీ.. 352 ఓట్లు అవసరమయ్యాయి. దీంతో మెజారిటీకి 54 ఓట్లు తక్కువగా రావడంతో బిల్లు వీగిపోయిందని లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. 

అయితే, మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ (131వ రాజ్యాంగ సవరణ) బిల్లును డీలిమిటేషన్ బిల్లుకు ముడిపెడుతూ ప్రవేశపెట్టడంపైనే ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. మహిళా కోటా చట్టం సవరణ బిల్లును వేరుగా పెడితే మద్దతు ఇస్తామని తేల్చిచెప్పాయి. కానీ బిల్లును వేరుగా పెట్టేందుకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో ప్రతిపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి. దీంతో ఆమోదానికి సరిపడా ఓట్లు రాక బిల్లు వీగిపోయింది.