- బిల్లును వేరుగా పెట్టాలని కోరినా అంగీకరించని అధికార పక్షం
- లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు
- బిల్లు ఆమోదానికి 352 ఓట్లు అవసరం కాగా.. అనుకూలంగా 298, వ్యతిరేకంగా 230 ఓట్లు
- డీలిమిటేషన్, యూటీల చట్టాల సవరణ బిల్లులు వెనక్కి
- రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో వాటిని ఓటింగ్‌కు పెట్టని కేంద్రం
- మోదీ హయాంలో లోక్‌సభలో బిల్లు వీగిపోవడం ఇదే మొదటి సారి
న్యూఢిల్లీ: పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కొత్త జనాభా లెక్కల అవసరం లేకుండానే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి, డీలిమిటేషన్ చేపట్టి లోక్‌సభ సీట్లను పెంచడానికి ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2026 వీగిపోయింది.
శుక్రవారం లోక్‌సభలో జరిగిన డివిజన్ ఓటింగ్‌లో బిల్లుకు మద్దతుగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా, బిల్లు ఆమోదం పొందడానికి సభకు హాజరైనవారిలో మూడింట రెండు వంతుల మెజారిటీ.. 352 ఓట్లు అవసరమయ్యాయి.
దీంతో మెజారిటీకి 54 ఓట్లు తక్కువగా రావడంతో బిల్లు వీగిపోయిందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అయితే, మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ (131వ రాజ్యాంగ సవరణ) బిల్లును డీలిమిటేషన్ బిల్లుకు ముడిపెడుతూ ప్రవేశపెట్టడంపైనే ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి.
మహిళా కోటా చట్టం సవరణ బిల్లును వేరుగా పెడితే మద్దతు ఇస్తామని తేల్చిచెప్పాయి. కానీ బిల్లును వేరుగా పెట్టేందుకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో ప్రతిపక్షాలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి. దీంతో ఆమోదానికి సరిపడా ఓట్లు రాక బిల్లు వీగిపోయింది.
కాగా, రాజ్యాంగ 131వ సవరణ బిల్లు, 2026 ప్రకారం, 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) నిర్వహించి, 2029 పార్లమెంటరీ ఎన్నికల లోపు మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి లోక్‌సభ స్థానాలను ప్రస్తుతం ఉన్న 543 నుంచి గరిష్టంగా 850కి పెంచాల్సి ఉంది.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలలో కూడా సీట్లను పెంచాల్సి ఉంది. అయితే, రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఓటింగ్ సమయంలో సభలో ఉన్న వారిలో మూడింట రెండు వంతుల మెజారిటీ తప్పనిసరి.
ప్రస్తుత బలాబలాల ప్రకారం, రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించుకోవడానికి అవసరమైన సంఖ్యాబలం ఎన్డీయే సర్కారుకు లేకపోవడంతో బిల్లు వీగిపోయింది. లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యుల మద్దతు(సభలో 54 శాతం) ఉండగా, ప్రతిపక్షాలకు 233 మంది ఎంపీలు ఉన్నారు.
మరోవైపు రాజ్యసభలో ఎన్డీయేకు 141 మంది సభ్యుల మద్దతు ఉండగా (సభలో 58 శాతం), ప్రతిపక్షాలకు 83 మంది ఎంపీల మద్దతు ఉంది. మూడింట రెండొంతుల మెజారిటీ అంటే..163 మంది మద్దతు అవసరం ఉంటుంది కాబట్టి.. రాజ్యసభలో ఓటింగ్ జరిగినా ఈ బిల్లు గట్టెక్కే అవకాశాలు లేవు.
లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2026పై ఓటింగ్ ఇలా..
- ఆమోదానికి అవసరమైన మెజారిటీ: 352 ఓట్లు (మూడింట రెండొంతులు)
- ఓటింగ్‌లో పాల్గొన్న ఎంపీలు: 528
- బిల్లుకు అనుకూలం: 298
- వ్యతిరేకం: 230
- మెజారిటీకి తగ్గిన ఓట్లు: 54
- లోక్ సభలో ఎన్డీయే బలం: 293
- ప్రతిపక్ష ఇండియా బలం: 233
నారీ శక్తి వందన్ అధినియం(మహిళా రిజర్వేషన్ చట్టం), 2023ని సవరించడంతోపాటు డీలిమిటేషన్ బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026కి ఆమోదం పొందడం కోసం కేంద్ర ప్రభుత్వం గురువారం నుంచి మూడు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసింది. అయితే, మహిళా రిజర్వేషన్ చట్ట సవరణకు ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో దానితో ముడిపడి ఉన్న మిగిలిన రెండు బిల్లులను ముందుకు తీసుకెళ్లవద్దని స్పీకర్ ఓం బిర్లాను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఇవి మహిళా రిజర్వేషన్ చట్టంతో "అంతర్గతంగా ముడిపడి ఉన్నాయని" ఆయన పేర్కొన్నారు. దీంతో మొదటి బిల్లు వీగిపోవడంతో మిగిలిన రెండు బిల్లులకూ పార్లమెంట్ లో బ్రేక్ పడింది.
ఒకవేళ మహిళా కోటా సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది ఉంటే.. ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలలో ఆ కోటాను అమలు చేయడానికి మిగతా రెండు బిల్లులలో ఒకటి అవసరమయ్యేది. ఈ మూడు బిల్లులు ఆమోదం పొంది ఉంటే, 2029లో మహిళా రిజర్వేషన్లను అమలులోకి తెచ్చేవారు. చివరిగా ప్రచురించిన జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహించి, 2029 సాధారణ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850కి పెంచాలని కూడా ఈ సవరణల్లో పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్షాలు మొదటి నుంచి ఈ సవరణలన్నింటినీ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి.
మోదీ హయాంలో ఇదే తొలిసారి..
లోక్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు సభలో ఉన్నారు. అయితే, మోదీ ప్రభుత్వ హయాంలో ఒక బిల్లు పార్లమెంటులో వీగిపోవడం ఇదే మొదటిసారి. ఓటింగ్ అనంతరం బిల్లు వీగిపోవడంతో, స్పీకర్ ఓం బిర్లా సభను శనివారానికి వాయిదా వేశారు. కాగా, దేశ మహిళలను గౌరవించే చారిత్రక అవకాశాన్ని ప్రతిపక్షాలు చేజార్చుకున్నాయని, కానీ మహిళలకు హక్కులు కల్పించే విషయంలో మోదీ ప్రభుత్వ పోరాటం కొనసాగుతుందని రిజిజు అన్నారు.
"చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు దక్కే వరకు మేం విశ్రమించం" అని ఆయన చెప్పారు. అయితే, బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీలే కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. బిల్లు వీగిపోయాక ప్రతిపక్షాలు సంబరాలు చేసుకోవడం, విజయనాదాలు చేయడం ఊహకు అందని విషయమన్నారు.
రాజ్యాంగంపై దాడిని తిప్పికొట్టాం
మహిళా రిజర్వేషన్ల చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు రాజ్యాంగంపై జరిగిన దాడి. ఈ దాడిని ప్రతిపక్షాలు విజయవంతంగా ఓడించాయి. ఈ బిల్లు ఉద్దేశం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కాదు. దేశ ఎన్నికల స్ట్రక్చర్‌ను మార్చడానికి చేసిన ప్రయత్నం.
ప్రధానికి నిజంగా మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే 2023లో ఆమోదించిన చట్టాన్ని యథాతథంగా తీసుకురండి. ప్రతిపక్షాలన్నీ దానికి బేషరతుగా మద్దతిస్తాయి. ఈ రోజు నుంచే రిజర్వేషన్లు అమలయ్యేలా చూద్దాం. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి మహిళల పేరుతో రాజ్యాంగ విరుద్ధమైన ట్రిక్కును వాడారు. దీన్ని దేశమంతా చూసింది. ‘ఇండియా’ కూటమి ఆపింది. రాజ్యాంగం వర్ధిల్లాలి.
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

