- గూగుల్, మెటా ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల హాజరు
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నియంత్రణపై సోమవారం పార్లమెంటరీ ఐటీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి గూగుల్, మెటా, యూట్యూబ్ తదితర సంస్థల ప్రతినిధులతో పాటు కేంద్ర హోం, ఐటీ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌ను మెటా సంస్థ తాత్కాలికంగా నిలిపివేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆ సంస్థ గ్లోబల్ టీమ్‌కు సమన్లు జారీ చేసిన కొద్దిరోజుల్లోనే ఈ సమావేశం జరగడం గమనార్హం.
ఈ భేటీకి కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్‌లతో పాటు ప్రముఖ సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ స్నాప్‌చాట్, గూగుల్, ఎక్స్, మెటా (ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్), యూట్యూబ్ ప్రతినిధులు హాజరై ‘సోషల్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు వాటి నియంత్రణ’ అనే అంశంపై చర్చించారు. ప్రశ్న పత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ప్రధాని మోదీ దేశ యువతను ఉద్దేశించి చేసిన ఫేస్‌బుక్ పోస్ట్‌ను మెటా తొలగించిన విషయం తెలిసిందే.
టెక్నికల్ లోపం వల్లే పొరపాటున ఆ పోస్ట్ తొలగిపోయిందని, వెంటనే దాన్ని పునరుద్ధరించామని మెటా సంస్థ ప్రభుత్వానికి క్షమాపణలు కోరింది. ఇది కేవలం టెక్నికల్ అంశం మాత్రమే కాదని, దేశ, శాంతి భద్రతలకు సంబంధించిన అంశమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన ఘటనపై మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని నిశికాంత్ దూబే డిమాండ్ చేశారు
