నది మధ్యలో ఆగిన బస్సు.. కిటీకీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు

నది మధ్యలో ఆగిన బస్సు.. కిటీకీల్లోంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు

దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు ఉత్తర ప్రదేశ్ ను ముంచెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే డెహ్రాడూన్‌లో ఓ బస్సు వరదల్లో చిక్కుకుంది. భారీ వరదల కారణంగా HRTC బస్సు చిక్కుకుపోయినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ అయింది. ఇది వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్లిప్పింగ్ లో వరదల్లో చిక్కుకున్న బస్సు కిటికీల నుంచి ప్రయాణికులు బయటకు దూకుతున్నారు. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (HRTC) బస్సులోని ప్రయాణికులు ఎట్టకేలకు తృటిలో తప్పించుకున్నారు. వరద నీటి ప్రవాహానికి బస్సు కూడా బాగా వంగిపోయింది.  

ఉత్తర భారతంలో భారీ వర్షం..

ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా భారీ వరదలు సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు సంభవించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. వర్షం కారణంగా పలుచోట్ల భారీ విధ్వంసం కలుగుతుండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటం, వర్షాల కారణంగా ఇప్పటివరకు 28 మందికి పైగా మరణించారు.

HRTC bus passengers saved their lives by coming out of the windows near shimla bypass chowk in Dehradun. pic.twitter.com/AhcZ1N6UGQ

— Nikhil Choudhary (@NikhilCh_) July 10, 2023

మండిలోని పంచవక్త్ర వంతెన కూలిపోయింది

అంతకుముందు, జూలై 9న హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు దాదాపు అన్ని జిల్లాలను వణికించాయి. ఈ క్రమంలో మండిలోని పంచవక్త్ర వంతెన కూలిపోయింది. వివిధ ప్రాంతాలలో కొండచరియలు, ఆకస్మిక వరదలు సంభవించాయి. నది నీటి మట్టం పెరగడంతో చారిత్రక వంతెన కొట్టుకుపోయిందని మండి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అశ్వనీ కుమార్ తెలిపారు.