తెలంగాణ పై చెడుగా మాట్లాడలేదు : పవన్ కల్యాణ్

తెలంగాణ పై చెడుగా మాట్లాడలేదు : పవన్ కల్యాణ్
  •     ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలో ఎవరూ పోటీ చేయటం లేదు: పవన్ కల్యాణ్
  •     ఎన్నికల్లో పోటీపై ముందస్తు ప్రణాళికలు ఏమీ లేవని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తాను చెడుగా మాట్లాడలేదని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ ముమ్మాటికి ఆ ప్రాంత భూమిపుత్రులదేనన్నారు. బుధవారం అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. “తెలంగాణలో పోటీపై ముందస్తు ప్రణాళికలు లేవు. ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలో ఎవరూ పోటీ చేయడం లేదు. జనసేనలో ఉన్న తెలంగాణ నేతలు ఆ ప్రాంత నేతలే... ఆ ప్రాంత భూమి పుత్రులే. వాళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు. మా తెలంగాణ నేతలు పోరుపెడితే హైదరాబాద్ వెళ్లాను. అయినా హైదరాబాద్‌‌లో మా ఇంటికి నేను వెళ్లకూడదా? భూమికి సరిహద్దులు ఉంటాయి.. మనసుకు ఉండవు. 

దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించొద్దు. కేటీఆర్ నాకు సోదరుడు లాంటివారు. ప్రాంతీయవాదం వేరు.. ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడం వేరు. విభజించుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తాం?” అని పవన్ వ్యాఖ్యానించారు. ఏపీ కాంట్రాక్టర్లకు తెలంగాణలో ప్రాజెక్టులు ఇవ్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్ర విభజన నాటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ కాంట్రాక్టర్లు ఏపీకి ఎంత మంది రాలేదని పవన్ ప్రశ్నించారు. విభజన జరిగిన 12 ఏళ్ల తరువాత కూడా ఏపీ నేతలపై ఇంత ద్వేషం ఊహించలేదన్నారు. తమ పార్టీ మీటింగ్‌‌కు అనుమతి నిరాకరణ అంశం సీఎం రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందని తాను అనుకోవటం లేదన్నారు. దేశంలో బతకడం మన హక్కు అని, దానిని కాలరాసే హక్కు ఎవరికీ లేదన్నారు.

సామాజిక తెలంగాణకు 2009 నుంచే మద్దతు..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తన మద్దతు నిన్న మొన్నటిది కాదని పవన్ కల్యాణ్ అన్నారు. ఇది దశాబ్దాల క్రితం గుండెల్లో నుంచి వచ్చిన నినాదమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ఆకాంక్షల కోసం వచ్చిన నినాదమని బుధవారం ట్వీట్‌‌లో తెలిపారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగమైన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఉద్యమంపై మాట్లాడానన్నారు. 

యువరాజ్యం ప్రెసిడెంట్‌‌గా ఉన్నప్పుడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను ‘ఎక్స్​’లో ట్యాగ్ చేశారు. గద్దర్‌‌తో కలిసి తెలంగాణ సామాజిక న్యాయ సభలో పాల్గొన్నానని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల పట్ల తన నిబద్ధత చెక్కుచెదరలేదని, తన మద్దతు కేవలం రాజకీయం కాదని, నమ్మిన సిద్ధాంతం అని తెలిపారు.