V6 News

ఖాళీ జాగాలపై పన్ను బాదుడు..లబోదిబోమంటున్న సామాన్యులు

ఖాళీ జాగాలపై పన్ను బాదుడు..లబోదిబోమంటున్న సామాన్యులు
  • ప్రభుత్వ విధానంలో అనేక లోపాలు
  • ఎత్తేయాలంటూ డిమాండ్లు 

జీడిమెట్ల, వెలుగు: గ్రేటర్ లోని ఖాళీ స్థలాల యజమానులు ప్రభుత్వ చర్యలతో బెంబేలెత్తిపోతున్నారు. ఖాళీ స్థలాలపై పన్నులు(వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) చెల్లించాలని, లేకపోతే చర్యలు ఉంటాయంటూ మెసేజ్​లు వస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. ముక్కు పిండి పన్నులు వసూలు చేయడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం మెసేజ్​లు

రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా ఖాళీ స్థలాలపై 0.05 శాతం తగ్గకుండా 0.20 శాతం మించకుండా పన్నులు వసూలు చేస్తోంది. ఈ మధ్య కాలంలో అధికారులు తరచూ మేసేజ్​లు పంపుతూ పన్ను చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. దీంతో జనాలు లబోదిబోమంటున్నారు. సిటీలో ఆకాశాన్నంటిన ధరలతో సామాన్యుడు కనీసం100 గజాలు కొనలేని పరిస్థితి నెలకొంది. అష్టకష్టాలు పడి స్థలం కొంటే దాంట్లో ఇల్లు కట్టుకోవడానికి మళ్లీ డబ్బులు పోగుచేసుకోవాల్సిందే. అయితే, ఏళ్లపాటు కష్టపడి డబ్బు జమచేసుకుంటుంటే ఈ ఆగిన కాలానికి ఖాళీ స్థలానికి పన్ను చెల్లించటమేమిటని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.

పలు దశల్లో పన్నులు

ఓ నివాస యోగ్యమైన ప్లాట్ తయారు కావాలంటే అనేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమిని రెసిడెన్సియల్​గా మార్చడానికి లక్షల్లో నాలా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇది పూర్తి కాగానే వెంచర్ వేయడానికి అనుమతుల కోసం ఫీజులు చెల్లించాలి. వెంచర్ వేసిన తర్వాత ప్రతి ప్లాట్ కొనుగోలుదారుడు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజులతో సహ అనేక ఫీజులు చెల్లించి ప్లాట్ సొంత చేసుకుంటున్నాడు. ఇన్ని దశల్లో పన్నులు చెల్లిస్తున్నా సరిపోదన్నట్లు ఖాళీ స్థలంపై పన్ను వేయడం సామాన్యుడి సొంతింటి కలను మరింత ఆలస్యం చేయడమేనని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పన్ను విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్​చేస్తున్నారు. 

ఇది సరైన విధానం కాదు

ప్రజల నుంచి ఎలాగైనా డబ్బు వసూలు చేయాలనే ఖాళీ స్థలాలపై పన్ను వేస్తున్నట్లు తెలుస్తోంది. నేను కొన్ని రోజుల క్రితం ఓ ప్లాట్ కొనుక్కున్నా. రిజిస్ట్రేషన్ డబ్బులకు ఇబ్బందిగా ఉంటే మిత్రుడి వద్ద తీసుకున్నా. రిజిస్ట్రేషన్ తర్వాత కొద్దిరోజులకే ఆ ఖాళీ స్థలంపై రూ.11,015 పన్ను వేశారు. ఏండ్ల తరబడి ఆ స్థలం వేరే వ్యక్తి పేరు మీదుంటే ఆ పన్ను ఇప్పుడు నా మీద వేశారు. ఇది సరైన విధానం కాదు.
– రవి, జీడిమెట్ల