- బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ జవాబు చెప్పాలి: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- సమైక్య స్ఫూర్తికి బీజేపీ సర్కార్ విరుద్ధంగా వ్యవహరిస్తుంటే..
- ఆ పార్టీ అధ్యక్షుడు ఏ మొఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చాడు
- ఆంధ్ర నేత పవన్ ఇక్కడికి వచ్చి ఓట్లడిగితే ఎవరు వేస్తరు?
- అతన్ని ప్రచారానికి పిలవడం.. కేంద్ర మంత్రులు భిక్షాం దేహీ అన్నట్టుగానే ఉందని ధ్వజం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చెప్పాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చారంటే రాష్ట్రంలో ఆ పార్టీ పరిస్థితి ఎంతటి దయనీయ స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు.
రాష్ట్రానికి వచ్చిన నితిన్ నబీన్ కు స్వాగతం చెప్తున్నానని.. అయితే, ఆయన ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఓటు వేయమని అడిగే ముందు తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో చెప్పాలని డిమాండ్చేశారు. కేంద్ర ప్రభుత్వం సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండి చెయ్యి చూపారని మండిపడ్డారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోతుంటే.. కేంద్రం మాత్రం బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఫైర్అయ్యారు.
రాష్ట్ర విభజన హామీ ప్రకారం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన పథకాలు, నిధులు, ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేంద్రానికి కడుతున్న పన్నులను గుజరాత్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తూ తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్ లో ఉత్తరాది రాష్ట్రాలకు పెద్దపీట వేస్తూ దక్షిణాది రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపడం సమైక్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? అని ప్రశ్నించారు.
మున్సిపల్ ఎన్నికల్లో మతం పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నం
మున్సిపల్ ఎన్నికల్లో మతం పేరుతో బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని.. రాష్ట్ర ప్రజలు ఈ పార్టీ నేతల విషయంలో జాగ్రత్తగాఉండాలని మహేశ్గౌడ్సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా.. ఆ పార్టీకి డిపాజిట్ రాలేదన్నారు. బీసీలకు, మహిళలకు ఈ బడ్జెట్ లో తీరని అన్యాయం చేసిన కేంద్రం.. ఇప్పుడు ఈ వర్గాలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రావాలని పవన్ కల్యాణ్ ను కలిసి కోరడం భిక్షాం దెహీ అన్నట్టుగా ఉందని మహేశ్గౌడ్ఎద్దేవా చేశారు.
పవన్ ఆంధ్రా నాయకుడని, ఆయన అక్కడే రాజకీయం చేసుకోవాలన్నారు. తెలంగాణ వ్యతిరేకి పవన్ అని, తెలంగాణ గురించి నీచంగా మాట్లాడిన ఆయన ఇప్పుడు ఇక్కడి ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఆయన పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి కల్యాణ్ అని, ఆయన ప్రచారం చేస్తే ఇక్కడ ఓట్లు రావన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో బీ ఫామ్ లు పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు కాకుండా కొందరు ఎమ్మెల్యేలు వారికి ఇష్టం ఉన్నవారికి ఇచ్చుకున్నారని పీసీసీ అధ్యక్షుడు చెప్పారు. నలుగురైదుగురు ఎమ్మెల్యేలపై తమకు ఫిర్యాదులు అందాయని, వీటిని పరిశీలిస్తున్నామని చెప్పారు. కొత్తగూడెంలో సీపీఐతో స్నేహపూర్వక పొత్తు ఉంటుందని, జన సమితితో కూడా కొన్ని చోట్ల పొత్తు ఉందన్నారు. మజ్లీస్, బీఆర్ఎస్తో తమకు ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు.
సోషల్ మీడియా ప్రచార ప్రోగ్రాం ప్రారంభం
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా ద్వారా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు చేపట్టిన ప్రత్యేక ప్రోగ్రాంను బుధవారం గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రారంభించారు. సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించి ప్రజాపాలనలో ప్రజలకు జరుగుతున్న మేలును జనంలోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ సోషల్ మీడియా టీంను పీసీసీ చీఫ్ కోరారు.
