హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీపై కేటీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ పదేండ్లు నిరుద్యోగులను మోసం చేశారన్నారు. శనివారం గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ‘వారి పాలనలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిరుద్యోగులకు జాబులు రాలేదు. కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు వచ్చాయి’ అని ఎద్దేవా చేశారు.
“మేం అధికారంలోకి వచ్చాక 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. మీ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్క లు బయటపెట్టండి. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పదేండ్లలో చెయ్యని పనులు రెండున్నర ఏండ్లలో చేసి చూపెట్టాం. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్ ఇతర అన్ని పథకాలు అమలు చేస్తున్నాం. రూ. 8 లక్షల కోట్లు అప్పులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదు. నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వకుండా ఎందుకు అపారు. చేత కాక మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు” అని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.
పీసీసీ చీఫ్ పనితీరుపై మీనాక్షి సంతృప్తి
పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ పనితీరుపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్, జై బాపు – జై భీమ్, మనగేర కార్యక్రమం, డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరాలు, ఎస్‌ఐఆర్ శిక్షణా కార్యక్రమాలు, బీఎల్‌ఏల నియామకాలు, డీసీసీ కమిటీల ఏర్పాటువంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు పీసీసీ చీఫ్‌ను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. శనివారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కనెక్టింగ్ సెంటర్ చైర్మన్ సెంతిల్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తనను కలిసిన సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడారు.
