నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకే బీఆర్‌‌‌‌ఎస్ సంగ్రామ సభ  :  చనగాని దయాకర్

నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకే బీఆర్‌‌‌‌ఎస్ సంగ్రామ సభ  :  చనగాని దయాకర్
  • పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్

హైదరాబాద్, వెలుగు: నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకే బీఆర్‌‌‌‌ఎస్ సంగ్రామ సభను ఏర్పాటు చేసిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఆరోపించారు. అది బీఆర్‌‌‌‌ఎస్ యువ సంగ్రామ సభ కాదని, కేవలం కేటీఆర్ సంగ్రామ సదస్సు మాత్రమేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న బీఆర్‌‌‌‌ఎస్ నేతలకు, యువత గురించి మాట్లాడే అర్హత కూడా లేదన్నారు. శనివారం గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌‌‌‌ఎస్ అంటేనే లీకేజ్, ప్యాకేజీ అని రాష్ట్రంలోని నిరుద్యోగులంతా నమ్ముతున్నారన్నారు.

గతంలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీలకు ప్రధాన కారణం బీఆర్‌‌‌‌ఎస్ నేతలేనని, వారి ప్రస్తుత నేత ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమారే స్వయంగా అన్న విషయాన్ని గుర్తుచేశారు. పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్ పాలనలో 16 పోటీ పరీక్షల పేపర్లను లీకేజ్ చేసి, ఉద్యోగాలను అమ్ముకుని విద్యార్థుల ఉసురు పోసుకున్నారని మండిపడ్డారు. ప్రవళిక ఆత్మహత్యను ప్రేమ లేఖ అని కేటీఆర్ నీచంగా మాట్లాడారని, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను ఓడించి తమ బతుకును కాపాడండి అంటూ ఆత్మబలిదానం చేసుకున్న బొడ సునీల్ నాయక్ ఉదంతాలను ప్రస్తావిస్తూ.. ఆయా బాధిత కుటుంబాలకు గత పదేండ్లలో ఎందుకు ఉద్యోగాలివ్వలేదని నిలదీశారు.