తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్‌తో పోల్చినప్పుడు ఎటు పోయావ్..? పవన్పై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్

తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్‌తో పోల్చినప్పుడు ఎటు పోయావ్..? పవన్పై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్

హైదరాబాద్: తెలంగాణకు న్యాయం చేస్తామని, తెలంగాణ కోసం గొంతెత్తుతామని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువత, ప్రజలు ప్రాణత్యాగాలు చేసినప్పుడు, తెలంగాణను అవమానించే వ్యాఖ్యలు వచ్చినప్పుడు, రాష్ట్ర హక్కులను కాలరాసే ప్రయత్నాలు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణను అవమానించిన వారితోనే రాజకీయ పొత్తులు పెట్టుకుని, తెలంగాణకు అన్యాయం చేసిన శక్తులతోనే కలిసి నడుస్తూ, ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపించడం ప్రజలను మోసం చేసే రాజకీయ నాటకమని విమర్శించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణను పాకిస్తాన్‌తో పోల్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తెలంగాణపై పవన్కు ఇప్పుడు ప్రేమ పొంగుకొస్తుందని ఎంపీ వంశీకృష్ణ ఎద్దేవా చేశారు.

తెలంగాణ యువత, తెలంగాణ ఆత్మగౌరవం అవమానించబడిన ప్రతీ సందర్భంలో మౌనం పాటించిన వ్యక్తి ఇప్పుడు తెలంగాణకు రక్షకుడిలా మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీ... తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ... తెలంగాణ హక్కులను కాపాడేది కూడా కాంగ్రెస్ పార్టీయే అని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేశారు.

పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ పేరు ఉపయోగించే వారిని తెలంగాణ ప్రజలు ఎన్నడూ నమ్మరని, మాటలు కాదు చేతలే ముఖ్యం అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీపడదని, తెలంగాణ హక్కుల కోసం ఎప్పటికీ ముందుండి పోరాడుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.