- ఓట్ల తొలగింపు బీజేపీ పిరికితనానికి నిదర్శనం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- ఓట్ చోరీని రాహుల్ గాంధీ అధారాలతో బయటపెట్టినా ఈసీ చర్యలు తీసుకోలేదు
- నీట్ పేపర్ లీక్‌లతో పిల్లల భవిష్యత్తు నాశనం
- పోలీసు కేసులుంటేనే లీడర్లు అవుతామంటున్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్
- ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం
ఆదిలాబాద్, వెలుగు: సర్ పేరిట బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్, స్థానిక పార్టీలు బలంగా ఉన్న చోట్ల ఓట్లను తొలగిస్తోందని పెద్దపల్లి ఎంపీ, పార్టీ ఆదిలాబాద్ ఇన్‌చార్జి గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్‌ను ముందుపెట్టి గత ఎన్నికల్లో ఏ సీట్లలో, ఏ బూత్‌లో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వచ్చాయో.. అక్కడే ఓట్లను తొలగిస్తోందని, ఇది బీజేపీ పిరికితనానికి నిదర్శనమన్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లో డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ చోరీని రాహుల్ గాంధీ అన్ని ఆధారాలతో బయటపెట్టారని గుర్తుచేశారు. దీనిపై ఎలక్షన్ కమిషన్‌ను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం టాపిక్‌ను డైవర్ట్ చేస్తోందని విమర్శించారు. సర్ ప్రక్రియలో భాగంగా ఎంపికైన కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తమ బూత్‌లలో అన్యాయం జరగకుండా చూడాలని, అంబేద్కర్ స్ఫూర్తితో ఓటు హక్కును కాపాడుకొని, బీజేపీ కుట్రలకు తిప్పికొట్టాలన్నారు.
పేపర్ లీక్‌లతో పిల్లల భవిష్యత్తు నాశనం..
బీజేపీ సర్కారు అన్ని విషయాల్లో ఫెయిలైందని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. నీట్ పేపర్లు అమ్ముకున్న బీజేపీ మంత్రులకు పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా.. పదవిని పట్టుకొని వేలాడుతున్నారని మండిపడ్డారు. సీబీఎస్ఈలో భారీ స్కాం బయటపడిందని, దానిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇంధన రేట్లు పెంచబోమని చెప్పి, ఎలక్షన్లు కాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పది రోజుల్లో రూ.20 పెంచారని మండిపడ్డారు. ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని చెప్తున్న ప్రధాని మోదీ.. ఆయన మాత్రం ప్రైవేట్ ఫ్లైట్‌లో పోయి మెలోడి చాక్లెట్లు తినిపిస్తుంటారని, ప్రైమ్ మినిస్టర్లతో రీల్స్ పెడుతున్నారని విమర్శించారు. ప్రధాని, మంత్రులు ఫారిన్ ట్రిప్పులు చేస్తుంటే మన పిల్లలు నీట్, సీబీఎస్ఈ పేపర్ల లీక్‌లతో చావాల్నా అని నిలదీశారు. మరోవైపు, 30, 40 కేసులుంటేనే లీడర్లవుతామని యువతను కేటీఆర్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మన పిల్లల భవిష్యత్‌ను పాడు చేయాలని చూసే వారికి బుద్ధి చెప్పాలని కోరారు. సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, మాజీ ఎంపీ సోయం బాపురావు, పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్లు రమేశ్ బాబు, ఒబెదుల్లా కొత్వాల్, పార్టీ నేతలు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్, మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ నర్సయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మాజీ పీసీసీ కార్యదర్శి గండ్రత్ సుజాత, నాయకులు సంజీవ్ రెడ్డి, బోజారెడ్డి, గిమ్మ సంతోష్ పాల్గొన్నారు. ఆ తర్వాత మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి నివాసానికి వెళ్లిన వంశీకృష్ణ.. ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
మాలల సమస్యల పార్లమెంట్‌లో మాట్లాడుతా..
మాలల సమస్యలపై పార్లమెంట్‌లో మాట్లాడతానని ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ మాల సంక్షేమ సంఘ భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆయనను సన్మానించారు. మాలలకు వర్గీకరణలో చాలా అన్యాయం జరిగిందని సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్, సభ్యులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. రోస్టర్ పాయింట్లు 22లోపు ఒక్క పోస్టు కూడా మాలలకు కేటాయించలేదని, పార్లమెంటులో ఈ విషయాన్ని లేవనెత్తాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రాన్ని సమర్పించారు. మాలలకు న్యాయం చేయడానికి కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి సుధాకర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు మేకల మల్లన్న, వ్యవస్థాపక అధ్యక్షుడు బేర దేవన్న, మాజీ అధ్యక్షుడు సూరం భగవాండ్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు పాశం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
