ఆగస్టు 15 నుంచి తలసేమియా, సికిల్‌‌‌‌సెల్ బాధితులకు పింఛన్లు

ఆగస్టు 15 నుంచి తలసేమియా, సికిల్‌‌‌‌సెల్ బాధితులకు పింఛన్లు
  • దివ్యాంగుడు చనిపోతే తక్షణమే భార్యకు పెన్షన్​..
  • జాప్యాన్ని సహించేది లేదు: సీఎం రేవంత్​రెడ్డి 
  • తారు రోడ్డు లేని ఊరు ఉండొద్దు.. పంచాయతీల వర్గీకరణ ఆధారంగా కొత్త భవనాలు
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సీఎం సమీక్ష

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని తలసేమియా, సికిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెల్ ఎనిమియా బాధితులందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి కొత్త పింఛన్లు పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పురోగతిపై మంత్రి సీతక్కతో కలిసి గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన బాధితులను తక్షణమే గుర్తించి పింఛన్ల మంజూరు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు.

వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ సంతృప్తికర రీతిలో పింఛన్లు అందించాలని స్పష్టం చేశారు. దివ్యాంగుడు చనిపోయినప్పుడు వారి భార్యకు ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనుల వేగాన్ని పెంచాలని, సంక్షేమ ఫలాలు ప్రతీ ఇంటికీ అందేలా యంత్రాంగం నిరంతరం పనిచేయాలని కోరారు.

అభివృద్ధి పనుల పర్యవేక్షణ ఎంపీడీవోలకే..
మండల స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖల పరిధిలో జరిగే అభివృద్ధి పనులను పర్యవేక్షించే పూర్తి బాధ్యతను ఎంపీడీవోలకు అప్పగించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి 45 రోజులకు ఒకసారి తప్పనిసరిగా మండల పరిషత్తు సమావేశాలు నిర్వహించాలని, ఈ సమావేశాలకు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని ఆదేశించారు. సర్పంచులు తమ గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవడానికి ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని వివరించారు.

రాష్ట్రంలో తారు రోడ్డు లేని ఊరు అంటూ ఉండకూడదని, అన్ని గ్రామాలకు తారు రోడ్లు నిర్మించాలని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీలను జనాభా ప్రాతిపదికన ఏ, బీ, సీలుగా వర్గీకరించి ప్రతి పంచాయతీకి సొంత భవనం నిర్మించాలని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్య పనులు, ఇతర నిర్వహణ అంశాలపై పూర్తి బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రకరకాల కారణాలతో ఎన్నికలు జరగని పంచాయతీల్లో అత్యవసర పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు.

ఇందిరమ్మ చీరల నాణ్యతలో రాజీ వద్దు.. ఎన్ఐఎఫ్టీ విద్యార్థుల డిజైన్లు
రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరలు పూర్తి నాణ్యతతో, ఆకట్టుకునే రీతిలో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చీరల డిజైన్ల రూపకల్పన కోసం నేషనల్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ) విద్యార్థుల ప్రతిభను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో ఇచ్చిన ఇందిరమ్మ చీరలకు మహిళల నుంచి విశేష స్పందన లభించినందున, ఈసారి కూడా నాణ్యత, రంగుల ఎంపిక విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేలా కొత్త ప్రణాళికలు రూపొందించాలని కోరారు. చేనేత కార్మికులకు ఉపాధి పెరిగేలా, అదే సమయంలో లబ్ధిదారులైన మహిళలకు నాణ్యమైన ఉత్పత్తులు అందేలా శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. అధికారుల సమర్థవంతమైన నిర్వహణతోనే అనుకున్న లక్ష్యాలను వేగంగా చేరుకోగలమని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

తాగునీటి సరఫరాపై ముందస్తు జాగ్రత్తలు
ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సరఫరా విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గ్రామీణ తాగునీటి సరఫరా (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్), హైదరాబాద్ మెట్రో వాటర్, సాగునీటి శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. అన్ని రకాల అవసరాల కంటే తాగునీటి కేటాయింపులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.

స్థానికంగా అందుబాటులో ఉన్న నీటి వనరుల ఆధారంగానే తాగునీటి సరఫరా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ తాగునీటి పథకాల పరిధిలో పనిచేసే సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి నెలా ఐదో తేదీ లోపే వేతనాలు చెల్లించాలని అధికారులను కఠినంగా ఆదేశించారు. 

ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిశోర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.