తాగునీటి కష్టాలు: అందరికీ అందని మిషన్ భగీరథ వాటర్

తాగునీటి కష్టాలు: అందరికీ అందని మిషన్ భగీరథ వాటర్
  • కరోనా దెబ్బకు నిలిచిపోయిన పనులు
  •  వేసవి వేళ అల్లాడుతున్న జనం

ఎండా కాలం ప్రారంభంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. మిషన్ భగీరథ ద్వారా అందరికీ నీరు అందడంలేదు. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు సరఫరా అవుతున్న నీరు కూడా గోదావరి నుంచి వస్తున్నదే. ప్రస్తుతం గోదారిలో నీటి ప్రవాహం తగ్గుతుండడంతో ఆఫీసర్లు టెన్షన్ పడుతున్నారు. మిషన్ భగీరథ ద్వారా పూర్తి స్థాయిలో నీళ్లు ఇయ్యలేని పరిస్థితి. మరోవైపు గోదావరిలో నీళ్లను తోడే పనికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ప్రతీ ఇంటికి మంచినీరు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ పనులు కంప్లీట్ కాకపోవడంతో నీటి గోస ఎప్పటిలాగే ఉంది.

రూ.10 కోట్ల పనులకు బ్రేక్

భద్రాద్రి జిల్లాలో దాదాపు 1,516 హ్యాబిటేషన్లలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీటి సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటి వరకు దాదాపు 1,366 హ్యాబిటేషన్లకు ఇస్తున్నట్లు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో 60 శాతం కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అందులోనూ 267 ప్రాంతాలకు లోకల్ గా ఉన్న వనరుల ద్వారా, 38 ప్రాంతాల కు డైరెక్ట్ పంపింగ్ చేస్తున్నారు. ఇలా డైరెక్ట్ సప్లై చేసిన నీటిని తాగే పరిస్థితి లేదు. దాదాపు 38 ఓవర్ హెడ్ ట్యాంక్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం దాదాపు 1,54,858 ఇండ్లకు మొదటి దశలో నీళ్లందించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేశారు. సర్వే అనంతరం జిల్లాలో ఇళ్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, విపక్ష నేతలు ఆఫీసర్లు, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడంతో ప్రభుత్వం స్పందించింది. మరో 87,714 ఇళ్లకు భగీరథ నీటిని ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు గానూ రూ.26 కోట్లనిధులు మంజూరు చేసింది. దాదాపు రూ.16 కోట్ల పనులకు చెల్లింపులు కూడా చేసింది. కానీ కరోనా ఎఫెక్ట్ తో దాదాపు రూ.10 కోట్లమేరా పనులకు బ్రేక్ పడింది. ఇవేగాక పైపులైన్లు, ఇళ్లకు నల్లా కనెక్షన్లకు గానూ రూ. 4 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. మారుమూల ప్రాంతాలైన పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లోని పలు చోట్ల పైపు లైన్లు వేసినా నీళ్లుమాత్రం  రావడం లేదని ఆ ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో అంతర్భాగంగా ఉన్న లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాలకు ఇంటింటికీ భగీరథ కనెక్షన్ ప్రధాన వీధుల వరకే పరిమితమైంది.

రోజు విడిచి రోజు..

జిల్లాలో మిషన్ భగీరథకు ప్రధాన వనరైన గోదావరిలో నీటి ప్రవాహం తగ్గుతోంది. భగీరథ ద్వారా ప్రతి రోజు 19 కోట్లలీటర్ల నీటిని ఇస్తున్నారు. కాగా గోదావరిలో నీటి ప్రవాహం తగ్గడంతో ప్రస్తుతం 12 కోట్ల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. అవి కూడా రోజు విడిచి రోజు, కొన్నిప్రాంతాల్లో రెండ్రోజులకోసారి నీళ్లువదులుతున్నారు. గోదారిలో నీళ్లు అడుగంటుతుండడంతో బోర్ల ద్వారా నీటిని తోడాలని ఆఫీసర్లు చూస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం నుంచి నీటి రాక కోసం నిరీక్షిస్తున్నారు. అక్కడి నుంచి నీళ్లొస్తే భగీరథ ద్వారా నీటి సరఫరాకు అంతరాయం లేకుండా ఉంటుందని భావిస్తున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియ సొంత మండలమైన టేకులపల్లిలో ఇప్పటి వరకు మిషన్ భగీరథకు సంబంధించి చుక్క నీరు అందకపోవడం గమనార్హం.