హామీలు ఏమైనయ్​? సమస్యల సంగతేంది..ఎమ్మెల్యేలు, మంత్రుల నిలదీత

హామీలు ఏమైనయ్​? సమస్యల సంగతేంది..ఎమ్మెల్యేలు, మంత్రుల నిలదీత

కరీంనగర్/నెట్ వర్క్, వెలుగు:  తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రామాలకు వస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు జనం చుక్కలు చూపిస్తున్నారు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారని, పంట నష్టపరిహారం డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంకెప్పడు కట్టిస్తారని, కొత్త పింఛన్లు, దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. సంబురాల కోసమని వెళ్తే జనాలు పెండింగ్ హామీలపై ప్రశ్నిస్తుండడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఫ్రస్టేషన్ కు లోనవుతున్నారు. సమాధానం చెప్పలేక పోలీసులతో గెంటివేయిస్తున్నారు. 

గురువారం ఒక్క రోజే మంత్రి గంగుల కమలాకర్, మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే రాములు నాయక్, చిరుమర్తి లింగయ్య, రెడ్యానాయక్​ప్రజల నుంచి నిరసనను ఎదుర్కొన్నారు. గత నెల రోజులుగా ఎక్కడో చోట ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్,​ కందాల ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర్​రావు ఇప్పటికే ప్రజాగ్రహానికి గురయ్యారు. దీంతో మిగతా ప్రజాప్రతినిధులు ఎక్కడ ఎవరు అడ్డుకుంటారోనని భయపడుతూ ఉత్సవాలకు వెళ్తున్నారు. 

చెర్లబూత్కూరులో మంత్రి గంగుల అడ్డగింత 

తమ గ్రామంలో ఒక్కరికి కూడా దళితబంధు మంజూరు కాలేదని, తాగునీరు సరఫరా కావడం లేదని, కొత్త పింఛన్లు రావడం లేదని కరీంనగర్ రూరల్ మండలం చెర్లబూత్కూరులో దళితులు మంత్రి గంగుల కమలాకర్​ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఊరికి వచ్చిన బీసీ సంక్షేమం, సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను వేదిక వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సుమారు వంద మంది  దారికి అడ్డంగా కూర్చుని నిరసన తెలపడంతో పోలీసులు వారిని సముదాయించేందుకు యత్నించారు. అయినా వినకపోవడంతో మంత్రి వారి దగ్గరకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేరే గ్రామంలో దళిత బంధు స్కీం అమలవుతున్నా తమ గ్రామంలో మాత్రం ఒక్కరికి కూడా మంజూరు కాలేదని, పింఛన్ కు అర్హత ఉన్నవారి నుంచి అప్లికేషన్లు తీసుకోవడం లేదని, డబుల్ ఇండ్లు ఇవ్వడం లేదని, మంచినీళ్లు రావడంలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన సముదాయించడంతో ఆందోళన విరమించారు.  

అన్నిచ్చినం అంటున్నరు ఏమీ ఇయ్యలే.. 

మంత్రి మల్లారెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న మహిళ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ జిల్లా శామీర్​పేట మండలం మజీద్​పూర్, అలియాబాద్ గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతిలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డికి గ్రామస్తుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. అలియాబాద్​లో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాల గురించి చెబుతుండగా ఓ మహిళ లేచి ప్రసంగాన్ని అడ్డుకుంది. ‘ సర్కారు ఎన్నో ఇచ్చిందని చెప్తున్నరు.. కానీ ఇప్పటివరకు మాకు సొంతిల్లు లేదు. పొలం లేదు. ప్రభుత్వం నుంచి జాగా కూడా రాలే. మీరేమో 60 గజాల ప్లాట్లిచ్చినం, దళితబంధు ఇచ్చినమని చెప్తున్నరు’ అంటూ ప్రశ్నించింది. దీంతో మంత్రి సమాధానం చెప్పకుండానే ‘ ఇంకో మీటింగ్ ఉంది.. మళ్లొస్తా’ అంటూ వెళ్లిపోయారు. అలాగే మజీద్​పూర్ లో పల్లెప్రగతి కార్యక్రమానికి ముందు అంబేద్కర్​ విగ్రహానికి నివాళులర్పించకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీంతో పోలీసులు వచ్చి  గ్రామస్తులను పంపించివేశారు. తూముకుంటలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో మల్లన్న గుడి కోసం మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు, ప్రధాన అర్చకులు, పూజారులు కుటుంబసభ్యులతో సహా అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. మూడు ఆలయాలు ఉండగా కొత్త గుడి ఎందుకని ప్రశ్నించారు. దీన్నంతా అర్చకుల కుటుబానికి చెందిన  ఓ మహిళ మొబైల్​లో వీడియో తీస్తుండగా.. బీఆర్ఎస్ నాయకులు ఫోన్​లాక్కున్నారు. దీంతో బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి నూనెముందల రవీందర్​ గౌడ్ ఆందోళనకారులకు మద్దతు పలకగా, పోలీసులు ఆయనతో ఆందోళన చేస్తున్న వారిని పక్కకు లాక్కెళ్లారు.   

రుణమాఫీపై ప్రశ్నిస్తే బయటకు పొమ్మన్న ఎమ్మెల్యే 

లక్ష రూపాయల రైతుల రుణమాఫీ ఎప్పుడు చేస్తారంటూ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్​, ఎమ్మెల్సీ తాత మధుసూదన్​రావును  ఓ రైతు నిలదీశాడు. గురువారం వైరాలోని గొల్లపూడి రైతు వేదిక ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వచ్చారు. ఈ సందర్భంగా రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని రైతులు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఓ రైతును వేదిక భవనం నుంచి బయటకు గెంటివేయాలని పోలీసులను ఆదేశించారు. దీంతో వాళ్లు వచ్చి అతడిని పక్కకు తీసుకువెళ్లారు. తర్వాత ఎమ్మెల్సీ తాతా మధు రైతులకు సర్ధి చెప్పారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. 

తాగునీరు, ఇండ్లు, దళితబంధు ఎందుకియ్యలేదని  డోర్నకల్​ ఎమ్మెల్యేకు ​ప్రశ్నలు 

 మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లలో డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడుతుండగా జనాలు అడ్డుకున్నారు. డబుల్​బెడ్​రూం ఇండ్లు, తాగునీరు, విద్యుత్ ​సమస్యలతో సతమతమవుతున్నామని చెప్పారు. దీనికి ఎమ్మెల్యే సమాధానమిస్తూ రెండు నెలల్లో 20 ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. మహబూబాబాద్​ ఎంపీ కవిత మాట్లాడుతూ సీఎం ఇచ్చేవి కాకుండా తన కోటా నుంచి మరికొన్ని ఇండ్లను సర్దుబాటు చేస్తానని చెప్పారు. 

రాంపురంలో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ప్రజలు అడ్డుకున్నారు. నీళ్లు రావడం లేదని సర్పంచ్, ఎంపీటీసీకి చెప్తే పట్టించుకోవట్లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేయగా దళిత బంధు అయితే 20 మందికి ఇస్తానని,ఇండ్లయితే 30 మందికి ఇస్తానని ఏదో ఒకటి తేల్చుకోవాలన్నారు. దీంతో అసహనానికి గురైన గ్రామస్తులు స్టేజీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేయగా కూర్చుని మాట్లాడుకొని ఫైనల్ డెసిషన్ చెప్పాలన్నారు. సభ ముగించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

మొగుళ్లపల్లిలో అన్నీ ఉన్నోళ్లకే ఇచ్చారన్న మహిళ

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో గురువారం జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. బీఆర్​ఎస్​పాలనలో తమకు ఏం రాలేదని, అన్నీ ఉన్నోళ్లకే ఇచ్చారంటూ రంగాపురానికి చెందిన వైనాల రజిత సభా వేదికపైకి వెళ్లింది. దీంతో ఆమెను ఆఫీసర్లు పక్కకు తీసుకెళ్లి సమస్య ఏంటని అడిగి న్యాయం జరిగేలా చేస్తామని చెప్పి మాట్లాడకుండా చేశారు.