ఆర్టీసీ కార్మికులకు అండగా జనం.. పెద్ద మనసుతో తోచిన విధంగా సాయం

ఆర్టీసీ కార్మికులకు అండగా జనం.. పెద్ద మనసుతో తోచిన విధంగా సాయం

ఇంటి కిరాయిలపై పట్టుపట్టని ఓనర్లు..

ఫ్రీగా సేవలు అందిస్తున్న డాక్టర్లు

ఆర్థిక సాయం అందిస్తున్న దోస్తులు, దాతలు..

నిత్యావసర సరకులు ఇస్తున్న సంఘాలు

ఇంటి అద్దె మాఫీ చేసే ఓనర్ ఒకరైతే… ఉచితంగా వైద్యం చేసే డాక్టర్ మరొకరు. పెన్షన్​ను విరాళంగా ఇచ్చే రిటైర్డ్ ఉద్యోగి ఒకరైతే… స్నేహాన్ని గుర్తించుకుని ఆర్థిక సాయం చేసే మిత్రులు ఇంకొందరు. నిత్యావసర సరుకులు ఇచ్చే సంఘాలు కొన్నయితే.. అన్నదానాలు చేసే మనసున్న మారాజులు మరికొందరు. ఒక్కరా ఇద్దరా.. ఇలా ఎంతో మంది రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో పిల్లాపెద్దా తేడా లేకుండా ఆర్టీసీ కార్మికులకు కొండంత అండగా నిలబడుతున్నారు. డిమాండ్ల సాధన కోసం సమ్మెకు పోవడం, రెండు నెలల నుంచి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవటంతో ఇబ్బంది పడుతున్న కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. తమకు తోచినంత సాయం అందించి మేమున్నామనే భరోసా ఇస్తున్నారు. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటూ తమ మానవత్వం చాటుకుంటున్నారు. వ్యాపారులు, భూరి దాతలెందరో తమవంతు సాయం అందించి కార్మికుల భుజం తడుతున్నారు. ఆత్మస్థైర్యం నింపుతున్నారు. చేతనైనంత సాయం చేసేందుకు ఒకరిని చూసి మరొకరు అడుగు ముందుకేస్తున్నారు. ఇలా ఆదుకుంటున్న వాళ్లు ఎందరో. వాళ్లలో కొందరి గురించి…

అప్పిచ్చి ఆదుకున్న ఇంటి ఓనర్

మంచిర్యాల డిపోలో డ్రైవర్​గా పనిచేస్తున్న పాషా.. భార్య, కూతురుతో కలిసి స్థానిక జాఫర్​నగర్​లోని రిటైర్డ్ సింగరేణి కార్మికుడు కరీముద్దీన్​ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. జీతం రాక గత నెల అద్దె చెల్లించలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న కరీముద్దీన్​ఎలాంటి దిగులు చెందవద్దని సూచించాడు. ఇంటి ఖర్చుల కోసం రూ.5 వేలు బదులు ఇచ్చాడు. ఆయన చేసిన సాయానికి పాషా థాంక్స్ చెప్పాడు.

రూ.5 వేల సాయం

షాద్ నగర్ టౌన్ ఆర్టీసీ కార్మికులకు టీజేఏసీ కన్వీనర్ అనురాధ రూ.5,000 విరాళం ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులు జీతాలు లేక నరకయాతన అనుభవిస్తున్నారని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ ఆమె డిమాండ్ చేశారు.