కంప్యూటర్ ఆపరేటర్ల కష్టాలకు శాశ్వత పరిష్కారం : మంత్రి సీతక్క

కంప్యూటర్ ఆపరేటర్ల కష్టాలకు శాశ్వత పరిష్కారం : మంత్రి సీతక్క
  •     పంచాయతీరాజ్ కమిషనర్‌కు మంత్రి సీతక్క ఆదేశం  

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని మండల కంప్యూటర్ ఆపరేటర్ అండ్​ క్లస్టర్ ఆపరేటర్ల ఏండ్లనాటి సమస్యలకు త్వరలోనే విముక్తి లభించనుంది. సచివాలయంలో మంగళవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను ఆపరేటర్ల ప్రతినిధులు కలిశారు. పెండింగ్ వేతనాలు, సర్వీస్ కంటిన్యూయేషన్ ఆర్డర్ల విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమకు రావాల్సిన జీతాలు సకాలంలో అందడం లేదని, కంటిన్యూయేషన్ లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని విన్నవించారు.  ఆపరేటర్ల గోడు విన్న మంత్రి సీతక్క వెంటనే సానుకూలంగా స్పందించారు. 

సమస్యను తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా పరిష్కరించాలని అక్కడే ఉన్న పంచాయతీరాజ్ కమిషనర్‌ను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1500 మంది మండల ఆపరేటర్లకు ఫైనాన్స్​ నుంచి కంటిన్యూషన్ ఆర్డర్లు లేకపోవడం వల్లే వేతనాల చెల్లింపులో జాప్యం జరుగుతోందని మంత్రికి కమిషనర్ వివరించారు. వెంటనే  ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌ అధికారులతో మంత్రి సీతక్క మాట్లాడారు. కంటిన్యూయేషన్​ ఆర్డర్​ ఇవ్వాలని,  జీతాలు రెగ్యులర్‌గా వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు.

మేడారం జాతరపై విష ప్రచారం తగదు

మేడారం జాతర విజయవంతమైనప్పటికీ కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఈ మేరకు మంగళవారం సెక్రటేరియెట్​లో మీడియాతో సీతక్క చిట్​చాట్​ నిర్వహించారు. ‘‘ఆలయ పునరుద్ధరణ పనులు, జాతర సక్సెస్​ఫుల్​గా జరిగాయి. కానీ, కొందరు జాతర ఏర్పాట్లపై విష ప్రచారం చేస్తున్నారు. ఒక్క దొంగతనం ఘటనను పట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్​ కాదు’’ అని అన్నారు. 

ప్రతిపక్ష నేతలు సైతం జాతర ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చినట్టు భావిస్తున్నామని చెప్పారు. వచ్చే జాతర కల్లా మేడారం చుట్టుపక్కల రోడ్లను వెడల్పు చేసి.. ట్రాఫిక్ జామ్ లను నివారిస్తామని చెప్పారు.