- హాజరైన ఈసీఐ అధికారులు అవినాశ్ కుమార్, సంజయ్ కుమార్
- రాష్ట్రంలో ఇప్పటివరకు 68.30% మ్యాపింగ్ పూర్తి: సీఈవో
హైదరాబాద్, వెలుగు: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ మూడో దశ ప్రక్రియను రాష్ట్రంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్ కుమార్, డిప్యూటీ సెక్రటరీ సంజయ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాల ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా నియమించిన ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్వోలు, సూపర్‌వైజర్ల వివరాలు, ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల ప్రగతిని ఈ సందర్భంగా వివరించారు.
ఈ సమీక్షలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సర్ ప్రక్రియపై డిజిటల్ ప్రజెంటేషన్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 68.30 శాతం మ్యాపింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలు, నోటీసుల జారీ, వాటి పరిష్కారంతోపాటు తుది ఓటరు జాబితా ప్రచురణ వరకు ప్రతి దశలోనూ అధికారులుపారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఓటరు నమోదు, గణన ఫారాలను నింపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. ఓటర్లకు వేగంగా సమాచారం అందించే ‘బుక్ ఏ కాల్’ సదుపాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారులు క్రమం తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి, బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్ఏ) ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని వివరించారు. సమావేశంలో అడిషనల్ సీఈవో వాసం వెంకటేశ్వర్ రెడ్డి, సంయుక్త సీఈవో ఎం.సత్యవాణి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.మనూచౌదరి, రాష్ట్ర మీడియా నోడల్ అధికారి ఎన్.శంకర్, డిప్యూటీ సీఈవో జీఎస్ చారి, రాష్ట్ర నోడల్ అధికారులు పాల్గొన్నారు.
