తెలుగు టైటాన్స్‌‌ కెప్టెన్‌‌గా అబొజర్‌‌

తెలుగు  టైటాన్స్‌‌ కెప్టెన్‌‌గా అబొజర్‌‌

ఏడో సీజన్‌‌కు తెలుగు జట్టు రెడీ

హైదరాబాద్‌‌, వెలుగు: ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌‌లో తెలుగు టైటాన్స్‌‌ కొత్త కెప్టెన్‌‌తో బరిలోకి దిగనుంది. ఇరాన్‌‌కు చెందిన స్టార్‌‌ డిఫెండర్‌‌ అబొజర్‌‌ మిఘాని కొత్త సీజన్‌‌లో జట్టును నడిపించనున్నాడు. గత సీజన్‌‌లో యువ డిఫెండర్‌‌ విశాల్‌‌ భరద్వాజ్‌‌ నాయకుడిగా ఉండగా.. ఈసారి అతని ప్లేస్‌‌లో అనుభవజ్ఞుడైన అబొజర్‌‌ను నియమిస్తున్నట్టు టైటాన్స్‌‌ యజమాని శ్రీనివాస్‌‌ బుధవారం ప్రకటించారు. గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియంలో ఈ నెల 20న ఏడో సీజన్‌‌ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌‌లో యు ముంబాతో తెలుగు టైటాన్స్‌‌ తలపడనుంది. 26వ వరకు హైదరాబాద్‌‌ అంచె పోటీలు జరుగుతాయి.

‘ప్రొ కబడ్డీకి తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ ఉంది. దేశంలో మరెక్కడా లేని విధంగా కబడ్డీకి హైదరాబాద్‌‌లో పెద్ద ఫ్యాన్స్‌‌ బేస్‌‌ ఉంది. అందులో లీగ్‌‌ మన నగరంలో మొదలు పెట్టేందుకు స్టార్‌‌ స్పోర్ట్స్‌‌ ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తుంది. ఈ సారి మా జట్టును అబొజర్‌‌ నడిపిస్తాడు. ఏషియన్‌‌ గేమ్స్‌‌లో గోల్డ్‌‌ నెగ్గిన ఇరాన్‌‌కు కోచ్‌‌గా వ్యవహరించిన ఘొలమ్‌‌రెజా చీఫ్‌‌ కోచ్‌‌గా ఎంచుకున్నాం. అన్ని విభాగాల్లోనూ మా టీమ్‌‌ చాలా బలంగా ఉంది. ఎప్పటి నుంచో పటిష్టంగా ఉన్న రైడింగ్‌‌తో పాటు ఈ సారి డిఫెన్స్‌‌ను మరింత మెరుగుపరుచుకున్నాం. ఫ్రెష్‌‌ లుక్‌‌ కోసం ఆరు సీజన్ల పాటు మాతో ఉన్న రాహుల్‌‌ చౌదరిని వదులుకున్నాం. అతని ప్లేస్‌‌లో అంతే టాలెంట్‌‌ ఉన్న సిద్దార్థ్‌‌ను తీసుకున్నాం. సౌత్‌‌ సెంట్రల్‌‌ రైల్వేస్‌‌ తరఫున గతంలో హైదరాబాద్‌‌లో ఆడిన అనుభవం అతనికి ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి మల్లికార్జున్‌‌, గణేష్‌‌ రెడ్డికి అవకాశం ఇచ్చాం. ఈ సారి ఫార్మాట్‌‌ కూడా మారింది. గతంలో ఒక జట్టుతో మిగతా జట్టు మూడు మ్యాచ్‌‌లు ఆడేది. ఈ సారి రెండే మ్యాచ్‌‌లు ఆడనుంది. దాని వల్ల లీగ్ మరింత ఆసక్తిగా సాగుతుంద’ని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్‌‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో టైటాన్స్‌‌ కెప్టెన్‌‌ అబొజర్‌‌, సిద్దార్థ్‌‌ దేశాయ్‌‌, కోచ్‌‌లు ఘొలమ్‌‌రెజా, జగదీశ్‌‌ కుంబ్లే పాల్గొన్నారు.