కరోనా చైనా నుంచి వచ్చిన ప్లేగు వ్యాధి: ట్రంప్

కరోనా చైనా నుంచి వచ్చిన ప్లేగు వ్యాధి: ట్రంప్

వాషింగ్టన్: కరోనా వైరస్ పుట్టుకకు చైనానే కారణమని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. డ్రాగన్ నిర్లక్ష్యం వల్లే ప్రపంచం అంతటా మహమ్మారి విస్తరిస్తోందని ట్రంప్ మండిపడిన విషయం విధితమే. తాజాగా మరోమారు బీజింగ్‌పై ట్రంప్ దాడికి దిగారు. కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిన ప్లేగు వ్యాధి అని మండిపడ్డారు. చైనాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొత్త బ్రాండ్ డీల్ చేసుకునే తరుణంలో వైరస్ వ్యాప్తి జరిగిందన్నారు.

‘చైనా నుంచి వచ్చిన ప్లేగు వ్యాధి అది. అవును ఇదే నిజం. అలా జరిగి ఉండాల్సింది కాదు. కానీ దానికి వారు అనుమతినిచ్చారు. మేం వాళ్లతో బ్రాండ్ న్యూ డీల్‌కు ఒప్పందాలు చేసుకున్నాం. సంతకం చేసిన పెన్నులోని ఇంక్ ఆరిందో లేదో అది (కరోనా వైరస్) బయటికొచ్చింది’ అని వైట్‌ హౌస్‌లోని గ్రాండ్ ఫోయెర్‌‌లో నిర్వహించిన స్పిరిట్ ఆఫ్ అమెరికా షోకేస్ అనే కార్యక్రమంలో ట్రంప్ చెప్పారు. జూలై నెలను అమెరికన్స్ వర్కర్స్ మంత్‌గా పేర్కొంటూ మంగళవారం ట్రంప్ ప్రకటనపై సంతకం చేశారు.